కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త పథకం..

- May 30, 2021 , by Maagulf
కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త పథకం..

న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది.నిత్యం లక్షల  కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.ఈ కోవిడ్ మహమ్మారి ఎంతో మంది ఇళ్లల్లో విషాదం నింపింది. పేగు బంధాలను, రక్త సంబంధాలను తెంచేసింది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసి అనాథలను చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఎన్నో విషాద గాథలు. కరోనా ప్రభావంతో.. గత ఏడాది నుంచి చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కుటుంబ పెద్ద మరణించడంతో తినడానికి తిండి లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐతే ఇలా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్న పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనాతో అనాథలైన పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు.ప్రైవేట్ విద్యా సంస్థలు లేదా కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లలో ఉచితంగా విద్య అందిస్తారు.యూనిఫామ్స్, బుక్స్ ఇతర ఖర్చులన్నీ పీఎం కేర్స్ భరిస్తుంది.వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా స్టైపండ్ అందిస్తారు.చదువుతో పాటు ఇతర ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది.23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు ఇస్తారు.

అంతేకాదు ఉన్నత చదువుల కోసం రుణాలను ఇప్పిస్తారు. ఆ లోన్‌ వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తారు. దానికి కూడా పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లిస్తారు.పిల్లలు దేశ భవిష్యత్తు వారికి అవసరమైన భద్రత, సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులను కోల్పోయిన..అలాంటి చిన్నారుల భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com