చైనాలో వరదల బీభత్సం..

- July 22, 2021 , by Maagulf
చైనాలో వరదల బీభత్సం..

బీజింగ్: చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత వెయ్యేళ్లలో ఎన్నడూ కురవనంత వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హెనాన్ ప్రావిన్స్ వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. భారీ వర్షాల కారణంగా ఇక్కడి యెల్లో నది ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తోంది. వరదల కారణంగా మొత్తం 25 మంది మరణించారు. 12.4 లక్షల మందిపై వరద ప్రభావం చూపగా, అధికారులు ఇప్పటి వరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మంగళవారం రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సబ్‌వే రైళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. రైళ్లలోకి నడుములోతులో నీళ్లు ప్రవేశించాయి. ఈ ఘటనలో 12 మంది మరణించారు. హెనాన్ ప్రావిన్స్ రాజధాని ఝెన్‌ఝూలో వరద నీటిలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా 160 రైలు సర్వీసులను 260 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఐఫోన్ సిటీగా పిలిచే ఝెన్‌జూలో నిన్న ఒక్క రోజే ఏకంగా 457.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

శనివారం నుంచి చూసుకుంటే ఇక్కడ సగటున 640.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇక్కడ గత వెయ్యేళ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో అప్రమత్తమైన చైనా సైన్యం వరద నీటిని మళ్లించేందుకు హెనాన్ ప్రావిన్స్‌లోని యుచువాన్ కౌంటీలో దెబ్బతిన్న యిహెతన్ ఆనకట్టను పేల్చేసింది. చైనా వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com