ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!

- May 03, 2024 , by Maagulf
ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు ఐటీ ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఐటీ రంగంలో స్దిరపడిన వారికి సైతం ఇప్పుడు ఉద్యోగాలు గ్యారంటీ లేకుండా పోతున్నాయి.

గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ లో టెక్ దిగ్గజాలుగా చెప్పుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ముగ్గురూ కలిపి ఏకంగా 64 వేల ఉద్యోగాల్లో కోత పెట్టేశాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్దిక సంవత్సరం మారినా ట్రెండ్ మారడం లేదు.

layoffs.fyi తాజాగా ప్రచురించిన డేటా ప్రకారం... సాంకేతిక రంగంలోని 50 కంపెనీల నుండి 21,473 మంది ఉద్యోగులు ఒక్క ఏప్రిల్ నెలలోనే తొలగించినట్లు తేలింది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులు చేసినప్పటి నుండి టెక్ తొలగింపులను ట్రాక్ చేస్తున్న ఈ పోర్టల్.. లేఆఫ్ ల పర్వం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ పోర్టల్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది కనీసం 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి.

జనవరిలో చూస్తే 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు చేశారు. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 తొలగింపులు చేశాయి. మార్చిలో 37 కంపెనీలు 7,403 ఉద్యోగాలను తీసేశాయి. మార్చిలో ఉద్యోగుల తొలగింపులో స్వల్ప తగ్గుదల కనిపించగా... తిరిగి ఏప్రిల్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ లో ఎక్కువగా లేఆఫ్ లు ఇచ్చేసిన కంపెనీల్లో యాపిల్, గూగుల్, అమెజాన్, ఇంటెల్, బైజూస్, టెస్లా, ఓలా క్యాబ్స్, హెల్తిఫై మీ, వైల్ పూల్ వంటి సంస్థలున్నాయి.

అత్యధికంగా యాపిల్ ఏప్రిల్ నెలలో 614 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇచ్చింది. రెండో స్ధానంలో ఉన్న గూగుల్ కూడా దాదాపు అంతే స్ధాయిలో ఉద్యోగులను తొలగించింది. మిగతా సంస్థలు కూడా విభాగాల వారీగా తాజాగా తొలగింపులు చేపట్టినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ ప్రభావం కచ్చితంగా భారత్ పైనా పడుతోంది. దీంతో టెక్ ఉద్యోగాలపై ఇప్పట్లో ఆశలు పెట్టుకునే పరిస్ధితులు లేవని నిపుణులు చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com