రివ్యూ: తుంటరిసినిమా
- March 11, 2016
సినిమా పేరు: తుంటరి తారాగణం: నారా రోహిత్.. లతా హెగ్డే.. వెన్నెల కిషోర్.. సుదర్శన్, పూజిత, అదుర్స్ రఘు, అలీ, షకలక శంకర్ తదితరులు కథ: మురుగదాస్ మాటలు : లక్ష్మీభూపాల్.. శ్రీకాంత్‌రెడ్డి
ఛాయాగ్రహణం:
పళనికుమార్ సంగీతం: సాయికార్తీక్ నిర్మాణ సంస్థ: శ్రీకీర్తి ఫిలింస్ స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం : కుమార్ నాగేంద్ర విడుదల: 11-03-2016 రీమేక్ సినిమాల విషయంలో తరచూ ఎదురయ్యే సమస్య... మాతృకలోని అనుభూతి ఉన్నది ఉన్నట్లుగా లేకపోవటం. కాపీ కొట్టినట్టుగా... అక్కడేం ఉందో ఇక్కడా అదే తీస్తూ వెళుతుంటారు. దీంతో చాలావరకు భావోద్వేగాలు పండవు. నిజానికి రీమేక్ సినిమాల విషయంలో ఇలాంటి ఎన్ని సమస్యలు ఉంటాయో.. అన్నే ప్లస్‌లూ ఉంటాయి. మాతృకలో దొర్లిన తప్పుల్ని రీమేక్‌లో సరిదిద్దుకొనే వెసులుబాటు ఉంటుంది. దర్శకుడు కుమార్ నాగేంద్ర అదే ప్రయత్నం చేశాడు. తమిళ చిత్రం 'మాన్ కరాటే'లో ఏమేం మైనస్‌లు ఉన్నాయో అవన్నీ సరి చేసుకొంటూ 'తుంటరి' తీశాడు. అందుకే అక్కడ రెండున్నర గంటల సినిమా ఇక్కడకొచ్చేసరికి రెండు గంటలైంది. మరి కథలోని ఫీల్ మాటేంటి? మాతృకలోని ఫీల్ తెలుగుతెరపై కనిపించిందా? లేదా? అన్నది చూస్తే..కథేంటంటే? విశాఖపట్నంలో టెలికాం కాలనీకి చెందిన రాజు (నారా రోహిత్) ఓ ఆవారా కుర్రాడు. అతడి దగ్గరికి ఐదురురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెళతారు. బాక్సింగ్ నేర్చుకొని పోటీలో పాల్గొనాలని.. అందుకోసం నెలకు రూ.లక్ష ఇస్తామని చెబుతారు. తనకు బాక్సింగ్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా అందుకు ఒప్పుకొంటాడు రాజు. అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా చేస్తాడు. ఇంతలో రాజుకి సిరి (లతా హెగ్డే) తారసపడుతుంది. ఆ అమ్మాయిని చూడగానే మనసు పడతాడు. తాను బాక్సింగ్‌కి వెళ్లాలంటే సిరి తన ప్రేమలో పడేలా సహకరించాలని ఆ ఐదుగురిని కోరతాడు. సిరి ప్రేమలో పడేందుకు వాళ్లు సహకరిస్తారు. ఇలా తన కోరికలన్నీ తీర్చుకొంటాడు రాజు. అయితే బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌తోనే చంపేసే కిల్లర్ రాజు (కబీర్‌సింగ్) అనే ప్రొఫెషనల్ బాక్సర్తో రాజు పోటీ పడాల్సి వస్తుంది. అతనితో పోటీ అంటే ఇంచుమించు ఆత్మహత్యే. మరి అలాంటి కిల్లర్ రాజుతో ఆవారా రాజు తలపడ్డాడా లేదా? అసలు రాజుపైనే ఆ ఐదుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెట్టుబడి పెట్టడానికి కారణమేమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి. ఎలా ఉందంటే? ఫాంటసీ కథతో తెరకెక్కిన చిత్రమిది. భవిష్యత్తు ముందే తెలిస్తే ఎలా ఉంటుందన్న ఓ ఆసక్తికరమైన అంశంతో కథ మొదలవుతుంది. దీంతో ప్రేక్షకుడు త్వరగానే కథలో లీనమవుతాడు. ఆ తర్వాత బలమైన వినోదంతో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. దీంతో కథ వేగంగా ముందుకు సాగుతుంటుంది. మన ప్రేక్షకులకు థియేటర్లో కూర్చునే ఓపిక చాలా తక్కువనో ఏంటో తెలియదు కానీ.. దర్శకుడు కుమార్ నాగేంద్ర ఇంకా వేగం పెంచేశాడు. ఆ వేగం మాటున ఫీల్ కాస్త మిస్ అయ్యిందన్న భావన కలుగుతుంది. స్క్రిప్టు మేరకు సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. కానీ.. లాజిక్‌లు వెతక్కూడదు. రాజు అగ్రిమెంట్ చేయడం.. ఆ తర్వాత తన గొంతెమ్మ కోరికలను తీర్చుకోవడం మొదలు.. బాక్సింగ్ రింగ్‌లో జరిగే సన్నివేశాల వరకు ప్రతిదీ ఫన్నీగానే ఉంటుంది. అందుకే.. లాజిక్ల గురించి ఆలోచించకపోతేనే మంచిది. కథలో హించేంత మలుపులేమీ ఉండవు. అందుకే దర్శకుడు వినోదంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాడు. పతాక సన్నివేశాలు చూస్తే.. ఆ మధ్యన వచ్చిన 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాని గుర్తుకు తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే? వినోద ప్రధానమైన ఈ కథలో నారా రోహిత్ ఒదిగిపోయిన తీరు బాగుంది. మంచి టైమింగ్‌తో వినోదం పండించే ప్రయత్నం చేశాడు. ఆయన రూపమే మరీ బొద్దుగా తయారైంది. అదొక్కటే ఇబ్బంది. మిగిలిన విషయాలన్నింట్లోనూ బాగా చేశాడు. లతా హెగ్డే తన పాత్ర పరిధి మేరకు గ్లామర్‌గా కనిపించింది. భావోద్వేగాలు పలికించాల్సిన కొన్ని చోట్ల మాత్రం ఆమె నటన తేలిపోయింది. వెన్నెల కిషోర్, సుదర్శన్, పూజిత బ్యాచ్ వినోదం బాగా పండించింది. అదుర్స్ రఘు.. షకలక శంకర్.. అలీ మెరుపులు మెరిపించారు. కబీర్‌సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్ కిల్లర్రాజు పాత్రలో అదరగొట్టాడు. ఆయన నటనతో నారా రోహిత్ హీరోయిజం కూడా ఎలివేట్ అయ్యింది. సాంకేతికంగా.. సాంకేతికంగానూ సినిమాకు మంచి మార్కులే పడతాయి. పళనికుమార్ ఛాయాగ్రహణం.. సాయికార్తీక్ సంగీతం సినిమాకి ప్రధాన బలమని చెప్పొచ్చు. ఫీల్‌ని క్యారీ చేసేలా సంగీతం ఉంది. అలాగే పళని ప్రతీ సన్నివేశాన్నీ రిచ్‌గా చూపించాడు. నిర్మాణ విలువలు కూడా తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. మధు కూర్పు సినిమా వేగాన్ని పెంచింది. కుమార్ నాగేంద్ర మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని సినిమాని తెరకెక్కించాడేమో అనిపిస్తుంది. మాతృకని పెద్దగా మార్చకపోయినా సన్నివేశాల్ని మాత్రం బాగా కుదించాడు. బలాలు * రోహిత్ * కథ * వినోదం * సంగీతం.. ఛాయాగ్రహణం బలహీనతలు: - ఫీల్ మిస్ కావటం - వూహకు తగ్గట్టే క్లైమాక్స్ చివరిగా.. వినోదాల తుంటరి గమనిక : ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









