అనాధ బాలల సంక్షేమానికి సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలుచేయాలి: ఉపరాష్ట్రపతి

- August 04, 2021 , by Maagulf
అనాధ బాలల సంక్షేమానికి సంబంధించిన చట్టాలను సమర్థవంతంగా అమలుచేయాలి: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: బాలల న్యాయ (రక్షణ, సంరక్షణ) చట్టం (జువెనైల్ జస్టిస్) విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వాగతించారు. సవరణలు చేసిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, ప్రభావవంతంగా అమలుచేయాలని ఆయన సూచించారు.
 
బుధవారం కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని కలిశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, అనాధల సంక్షేమానికి సంబంధించి ఇటీవలి కాలంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను, వివిధ విజ్ఞప్తులను కేంద్ర మంత్రికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ, బాలల న్యాయ ( సవరణలు) చట్టంలోని ప్రత్యేకమైన అంశాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. తాజా సవరణల ప్రకారం అనాధ పిల్లలకు సరైన సంరక్షణ అందించే ప్రయత్నం, వారి దత్తతకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే మార్పులను మరింత వేగవంతంగా, పకడ్బందీగా అమలుచేసేలా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు విశేషమైన అధికారాలు కట్టబెడుతోందని ఆమె వివరించారు.
 
దీంతోపాటుగా అనాధ బాలలకు మద్దతు కల్పించడం, వారికి పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపడుతున్న తీరును కూడా స్మృతి ఇరానీ తెలియజేశారు.
 
అనాధ పిల్లలు ఇబ్బందులు పడకూడదనేదే తమ ఆకాంక్ష అన్న ఉపరాష్ట్రపతి, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు కూడా తోడురావాలని, అప్పుడే వారి సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు మరింత సమర్థవతంగా అమలయ్యేందుకు వీలవుతుందన్నారు. ఇటీవల కొందరు అనాధ పిల్లలు ఉపరాష్ట్రపతి గారిని వారి నివాసంలో కలిసి తమ సమస్యలను విన్నవించిన సంగతి విదితమే.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com