టూర్ రద్దు చేసుకుని మరీ.. జో బిడెన్ అత్యవసర భేటీ

- August 22, 2021 , by Maagulf
టూర్ రద్దు చేసుకుని మరీ.. జో బిడెన్ అత్యవసర భేటీ

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలిబన్లు పేట్రేగిపోయారంటూ వేలెత్తి చూపుతోన్న వేళ.. అమెరికా తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగింది. తొలి ప్రాధాన్యత కింద ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సురక్షితంగా తరలించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో తాలిబన్ల దూకుడును అడ్డుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం వల్ల క్రమంగా ఉగ్రవాదులకు షెల్టర్‌గా మారుతుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఇదివరకు అమెరికా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడి చేసిన అల్-ఖైదా.. ఆప్ఘన్‌లోనే దీనికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. అల్-ఖైదాకు ఆశ్రయం ఇచ్చిందనే కారణంతో 20 ఏళ్ల కిందటే తాలిబన్లను నామరూపాల్లేకుండా చేసింది. యూఎస్. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి పరిస్థితే తలెత్తే ప్రమాదం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

అప్పట్లో అల్-ఖైదా పోషించిన పాత్రను ఇప్పుడు భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) తీసుకోవచ్చనే అనుమానాలు నెలకొంటోన్నాయి. ఇరాక్ ప్రధాన కేంద్రంగా కొన్నాళ్ల పాటు భారత్ సహా అనేక దేశాలను భయభ్రాంతులకు గురి చేసింది ఐసిస్. ఆ తరువాత దాని ప్రభావం తగ్గింది. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు.. ఇస్లామిక్ స్టేట్స్‌కు మళ్లీ ఊపిరి పోస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్స్ బలపడటమంటూ జరిగితే అది భారత్‌కు పెను ముప్పుగా పరిణమించదనడానికి గ్యారంటీ ఏ మాత్రం లేదు. అటు అమెరికాకు సైతం ముప్పు తప్పదు.

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. జాతీయ భద్రతా విభాగాధినేతలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. సిట్యువేషన్ రూమ్‌లో భేటీ అయ్యారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. ఆంటోని బ్లింకెన్, డిఫెన్స్ సెక్రెటరీ ల్లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టార్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లే, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్, నేషనల్ ఇంటెల్లిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ ఇందులో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొనాలనే కారణంతో తన స్వరాష్ట్రం డెలావర్ పర్యటనను కూడా జో బిడెన్ రద్దు చేసుకున్నారంటే.. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు అగ్రరాజ్యం అధ్యక్షుడిని ఏ రేంజ్‌లో కలవరపాటుకు గురి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. శనివారం ఆయన డెలావర్‌లోని విల్మింగ్టన్ పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని మరీ సిట్యువేషన్ రూమ్‌లో జాతీయ భద్రతా అధికారులతో జో బిడెన్ సమావేశం అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com