Covid Death Certificate: అలా అయితే.. అది కోవిడ్ మరణం కాదు!

- September 12, 2021 , by Maagulf
Covid Death Certificate: అలా అయితే.. అది కోవిడ్ మరణం కాదు!

న్యూ ఢిల్లీ: కోవిడ్ సంబంధిత మరణాలకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం ఓ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. కొవిడ్‌ మృతుల బంధువులకు మరణానికి గల కారణాలతో వైద్య ధ్రువపత్రాలు జారీ చేయాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 3వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ 31న కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించే మార్గదర్శకాలు, ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ మార్గదర్శకాల మేరకు.. ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్‌ పరీక్ష, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష లేదా ఆసుపత్రుల్లో/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కోవిడ్ నిర్ధరణకు ప్రామాణికంగా భావిస్తారు. ఓ వ్యక్తి కోవిడ్తో బాధపడుతూ ఉన్నా.. విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో, హత్యకు గురై, రోడ్డుప్రమాదాలతో మరణిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణించబోరని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కొవిడ్‌గా నిర్ధరించని కేసుల్లో ఆసుపత్రుల్లో గానీ, ఇళ్ల వద్ద గానీ మరణిస్తే.. జనన, మరణ నమోదుచట్టం 1969లోని సెక్షన్‌ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధ్రువీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ రిజిస్ట్రార్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తారు.

ఐసీఎంఆర్‌ అధ్యయనం మేరకు.. కోవిడ్ మరణాల్లో 95% పాజిటివ్‌ వచ్చిన 25 రోజుల్లోపు నమోదు అవుతున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవధిని 30 రోజులకు విస్తరిస్తూ బాధితులు ఆసుపత్రిలో లేదా ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ మరణించినా కోవిడ్ మరణంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల నిర్ధరణకు అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బంధువుల దరఖాస్తులు, ఫిర్యాదులను ఈ కమిటీ 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com