'మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌' కిరీటం దక్కించుకున్న తెలుగమ్మాయి

- September 18, 2021 , by Maagulf
\'మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌\' కిరీటం దక్కించుకున్న తెలుగమ్మాయి

శ్రీకాకుళం అమ్మాయి తన అందం, తెలివితేటలతో సింగపూర్‌ దేశ ప్రజల మనసు దోచుకుంది. 21 ఏళ్ల బాన్న నందిత 'మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021' కిరీటం గెలుచుకుంది. తన తల్లిదండ్రులు పుట్టిన ఊరు గర్వపడేలా చేసింది.. నందిత స్వస్థలం శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారులోని దూదివారి వీధి. ఇక్కడే సొంతిల్లు ఉంది. తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి 25 ఏళ్ల కిందట సింగపూర్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరూ సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రులే. ప్రస్తుతం గోవర్ధనరావు ఏవియేషన్‌ సప్లయ్‌ చెయిన్‌ సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. తల్లి మాధురి కూడా సివిల్‌ ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోదరుడు హర్ష సౌరవ్‌ కెనడాలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యనభ్యసిస్తున్నాడు. 2020 మార్చిలో వీరంతా నగరానికి వచ్చారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా చేసి పదవీ విరమణ పొందిన డాక్టర్‌ బాన్న సంజీవరావు నందితకు చిన తాత. దంత వైద్యులు బాన్న త్రినాథరావు పెదనాన్న.

తుది దశకు ఆరుగురు 
ఆరునెలలుగా వివిధ అంశాల్లో జరిగిన పోటీల తర్వాత ఆరుగురిని తుది దశకు ఎంపిక చేశారు. అందులో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలిచ్చిన నందితకు టైటిల్‌ వరించింది. తొలి నుంచీ మోడలింగ్‌ అంటే ఆమెకు అత్యంత ఇష్టం. తనకున్న అభిరుచితో సొంతంగానే సిద్ధమైంది. ఈ తరహా పోటీలకు హైస్కూల్లోనే బీజం పడింది. నృత్యం, నడవటంలో ప్రత్యేకంగా సాధన చేసింది. ఫ్యాషన్‌ రంగంలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోటీలకు కూడా హాజరైంది. సింగపూర్‌లో బాలీవుడ్‌ మిక్స్‌ జనరే డాన్స్‌కు ఆదరణ ఉంది. ఇందులోనూ నందిత ప్రతిభ కనబరుస్తోంది. చదువులోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. నందిత ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో డ్యూయల్‌ డిగ్రీ చదువుతోంది.

ఆనందంగా ఉంది 
మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా కిరీటాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉంది. డిసెంబర్‌లో ఇజ్రాయిల్‌లో జరిగే మిస్‌ యూనివర్స్‌ పోటీలకు హాజరవుతా. ఇవి మూడు వారాలు జరుగుతాయి. సింగపూర్‌ తరఫున ఈ పోటీల్లో పాల్గొంటా. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఈ పోటీలకు హాజరవుతారు. చదువుతో పాటు మోడలింగ్‌ ఉత్సాహానిచ్చే అంశమని నందిత వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com