సభాకార్యక్రమాలకు అంతరాయాలు కల్గించడం సభాధిక్కారమే: రాజ్యసభ చైర్మన్

- September 18, 2021 , by Maagulf
సభాకార్యక్రమాలకు అంతరాయాలు కల్గించడం సభాధిక్కారమే: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ: రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంటుల్లో సభా కార్యక్రమాలకు తరచూ అంతరాయం కల్గించడం పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులకున్న హక్కు కాదని, ఇలా చేయడం సభను ధిక్కరించడమే అవుతుందని అవుతుందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సభ్యుల హక్కుల్లో సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన సూచించారు.
శనివారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశప్రాంగణంలో.. ‘పార్లమెంటరీ కార్యక్రమాలకు అంతరాయం కల్పించడం పార్లమెంటు సభ్యుల హక్కేనా? లేదా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణమా?’ అనే ఇతివృత్తంపై జరిగిన శ్రీ రాం జెఠ్మలానీ స్మారకోపన్యాసం సందర్భంగా రాజ్యసభ చైర్మన్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో చట్టసభల్లో నెలకొన్న పరిస్థితులను, సభ్యులు తరచూ సభాకార్యక్రమాలకు అంతరాయం కల్గించడాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యల ద్వారా ప్రజల్లో చట్టసభల పట్ల గౌరవం తగ్గిపోతుందన్నారు. సభా నియమాలు, ప్రవర్తన నియమావళికి కట్టుబడి ప్రతి సభ్యుడు ప్రవర్తించాలని ఆయన సూచించారు.
రాజ్యసభ పనితీరు గతంలో 100 శాతం ఉండగా, ఇటీవలికాలంలో రాజ్యసభ సభ్యుల ప్రవర్తన కారణంగా అది 65 శాతానికి తగ్గిపోయిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. సభ్యులకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, అరెస్టుల నుంచి స్వేచ్ఛ, కోర్టు విచారణల నుంచి ఉపశమనం వంటి సభ్యులకున్న ప్రత్యేకమైన హక్కులన్నీ సభాకార్యక్రమాలు సాఫీగా, ప్రయోజనకరంగా సాగినప్పుడే వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 
లోక్‌సభ సభా హక్కుల కమిటీ ఇటీవల ఇచ్చిన ఓ నివేదికను రాజ్యసభ చైర్మన్ ప్రస్తావిస్తూ.. ‘తమను ఎన్నుకున్న ప్రజల వాణిని సమర్థవంతంగా, ప్రభావవంతంగా వినిపించేందుకే పార్లమెంటు సభ్యులకు ప్రత్యేకమైన హక్కులున్నాయి. ఇదే సభ్యులకు హక్కులు కల్పించడంలోని పరమార్థం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఆయన అన్నారు. సభాకార్యక్రమాలను సభ్యులంతా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లినప్పుడే వారి హక్కులు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలుంటుందన్న బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు శ్రీ ఎర్స్‌కిన్ మే భావాలను కూడా రాజ్యసభ చైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
చట్టసభల్లో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతుందని, తద్వారా ప్రభావవంతమైన చట్టాలను తీసుకొచ్చేందుకు వీలవుతున్నందున సభాకార్యక్రమాలకు అంతరాయం కల్గించకూడదని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు అన్ని పార్టీలు ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాజ్యసభ చైర్మన్ అన్నారు. 
 
77 ఏళ్ల సుదీర్ఘమైన న్యాయవాద జీవితంలోరాం జెఠ్మలానీ విలువలకు కట్టుబడి ఉన్నారని, న్యాయవ్యవస్థలో కొత్త అవకాశాలకు, సరికొత్త వ్యాఖ్యానాలకు దార్లు తెరిచారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చట్టసభల్లో తన వాణిని బలంగా వినిపించారన్నారు. శ్రీ రాం జెఠ్మలానీ వంటి న్యాయకోవిదులు చూపిన బాటలో యువత నడవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.
 
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, పార్లమెంటు సభ్యడు మహేశ్ జఠ్మలానీ, భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ సొలిసిటర్ జనరల్‌లు రంజిత్ కుమార్, గోపాల్ సుబ్రమణియన్, తుగ్లక్ పత్రిక సంపాదకుడు, న్యాయకోవిదుడు ఎస్ గురుమూర్తి, ఐటీవీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కార్తికేయ శర్మ, న్యూస్ ఎక్స్ సంస్థ సంపాదకుడు రిషభ్ గులాటితోపాటు పలువురు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com