భారీ వర్షాల పై సీఎం కెసిఆర్ సమీక్ష

- September 27, 2021 , by Maagulf
భారీ వర్షాల పై సీఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ. గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్‌ను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సిఎం స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో సోమేశ్‌కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో సిఎస్‌తో పాటు డిజిపి మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందస్తుగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లలో ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. అనంతరం డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్‌పిలని ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ను సైతం నిర్వహించడం జరిగిందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com