టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ

- October 10, 2021 , by Maagulf
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ

యూఏఈ, ఒమన్​ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ )  ఆదివారం ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు 12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ రూపంలో  లభిస్తుంది. అదేవిధంగా  రన్నరప్‌గా నిలిచిన జట్టుకి  రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు(నాలుగు లక్షల డాలర్లు) వరకు వస్తుంది.అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటాయి.ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 16 జట్లు 5.6 మిలియన్‌ డాలర్లను పంచుకోనున్నాయి.2016 వరల్డ్‌కప్ వలె సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్‌ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ ఇవ్వనుంది.

సూపర్ 12 దశలో మొత్తం  30 మ్యాచులు జరుగుతాయి.  గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు దక్కనుంది. ఈ రౌండ్‌ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. సూపర్ 12 నుంచి ఇంటిముఖం పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందజేయనుంది. దీని కోసం ఐసీసీ మొత్తంగా 5,60,000 డాలర్లను ఖర్చు చేయనుంది. ఇక రౌండ్‌ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి. ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను ఐసీసీ  కేటాయించింది. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు రౌండ్‌ వన్‌లో పోటీ పడబోతున్నాయి.  ఇక సూపర్‌ 12లో అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ పోటీ పడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com