ఫ్లూ సీజన్ లో పాటించాల్సిన జాగ్రత్తల పై అవగాహన కలిపించిన డా.రవి తేజ తంగిరాల

- October 12, 2021 , by Maagulf
ఫ్లూ సీజన్ లో పాటించాల్సిన జాగ్రత్తల పై అవగాహన కలిపించిన డా.రవి తేజ తంగిరాల
ప్ర) వేసవి నుంచి శీతాకాలంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సాధారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలు ఎలా వుంటాయి?
 
జ) వేసవి నుండి శీతాకాలంలోకి  ప్రవేశిస్తున్న తరుణంలో యూఏఈలో మనం జాగ్రత్త పడాల్సిన అనారోగ్య సమస్యలు ఏమిటంటే , ఫ్లూ, ర్హినీటిస్ , సాధారణ జలుబు  సంబంధిత రోగాలు , పొడిబారిన చర్మం  , ఎలర్జీలు మొదలగునవి. కరోనా నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు కనుక దాని గురించి కూడా జాగ్రత్త వహించాలి.
 
ప్ర) కరోనా పాండమిక్ నేపథ్యంలో, సాధారణ ఫ్లూ సమస్యల్ని ఎలా వేరుగా గుర్తించగలం?
 
జ) కరోనా మరియు సాధారణ ఫ్లూ సమస్యలు దాదాపు గ ఒకే లాగా ఉండటం వలన పేషెంట్ లకి ,డాక్టర్ లకి కూడా ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. కరోనా వాక్సిన్ ప్రభావం వల్ల కూడా వ్యాధి లక్షణాలు క్రమేపి తగ్గు ముఖం పడుతున్న తరుణంలో ఫ్లూ మరియు కరోనా మధ్య వ్యత్యాసం చాల తక్కువ.  టెస్ట్ చేయించుకోవడం అనివార్యం.
 
ప్ర) సాధారణంగా కనిపించే ఫ్లూ లక్షణాలేంటి.? వాటి పట్ల ఎలా  అప్రమత్తంగా వుండగలం?
 
జ) సాధారణంగా ఫ్లూ లో మనకి కనిపించే లక్షణాలు జ్వరం ,దగ్గు, జలుబు,గొంతు నొప్పి ,ఒళ్ళు నొప్పులు, అలసట. పిల్లలలో ఎక్కువగ  వాంతులు ,విరోచనాలు కూడా రావొచ్చు. అందరికి జ్వరం ఉండాలని లేదు. ఫ్లూ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు మరియు ముక్కును కప్పుకోండి. నీరు మరియు సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, మరియు పరిశుభ్రత సంక్రమించే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఉపరితలాలు మరియు వస్తువులను తరచుగా శుభ్రపరచడం మరియు క్రిమిసంహారక చేయడం. ఇతరులకు సోకకుండా ఉండటానికి అనారోగ్యంతో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇతరులతో సంబంధాన్ని పరిమితం చేయండి. నివారణకు వార్షిక టీకా ఉత్తమ మార్గం. 
 
ప్ర) సాధారణ ఫ్లే లేదా కరోనా మధ్య తేడాని గుర్తించి, వైద్యులను సంప్రదించాలంటే ఎలాంటి అవగాహన పెంచుకోవాల్సి వుంటుంది?
 
జ) జలుబు ,దగ్గు మొదలగు లక్షణాలు మొదలైన వెంటనే వేరుగా ఉండడం,మాస్కులు ధరించడం, కోవిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. స్కూల్ పిల్లల విషయం లో మరింత జాగ్రత్త అవసరం.వైద్యుల సలహా తీసుకోవడం చాల అవసరం.  
 
ప్ర) సాధారణ ఫ్లూ సమస్యలు కొందరిలో తీవ్ర అనారోగ్యానికి కారణమవ్వొచ్చు, అలాంటివారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
 
జ) 2 వారల వ్యవధి లో ఎక్కువ శాతం మందికి పూర్తిగా నయం అయిపోతుంది. కొందరు పేషెంట్ లకు ఫ్లూ కాంప్లికేషన్స్ కి దారి తీసి న్యుమోనియా  మొదలగు వ్యాధులకు కారణం అవుతుంది. ఇమ్మ్యూనిటి / రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న మనుషులలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆవిరి పట్టడం, వేడి నీళ్లలో ఉప్పు వేసుకుని పుక్కిలించడం, నీళ్లు ఎక్కువ తాగడం, సాధ్యమైనంత త్వరగా డాక్టర్ లకు చూపించుకోవడం మంచిది. నివారణకు వార్షిక టీకా ఉత్తమ మార్గం. 
 
ప్ర) ఫ్లూ సమస్యలు రాకుండా అందుబాటులో వున్న వ్యాక్సిన్లు ఏమిటి.? వాటిని ఎవరెవరు తీసుకోవచ్చు?
 
జ) కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా టీకా ఫ్లూకి కారణమయ్యే సాధారణ వైరస్ల నుండి రక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఫ్లూకి కారణమయ్యే ప్రధాన వైరస్లను చేర్చడానికి ఫ్లూ వ్యాక్సిన్ వార్షికంగా అప్డేట్ చేయబడుతోంది. క్వాడ్రివాలెంట్ ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) టీకా నాలుగు ఇన్ఫ్లుఎంజా A వైరస్లు మరియు రెండు ఇన్ఫ్లుఎంజా B వైరస్లతో సహా నాలుగు వేర్వేరు ఫ్లూ వైరస్ల నుండి రక్షించడానికి రూపొందించబడింది. 6నెలలు పైబడిన ప్రతి ఒక్కరు ఫ్లూ వాక్సిన్ తీసుకోవచ్చు. 9 సంవత్సరాలు కన్నా చిన్న పిల్లలకి 4 వారల వ్యవధి లో 2 డోస్ ఇవ్వాలి. 9 సంవత్సరాలు నిండిన అందరికి ఒక్క డోస్ ఇస్తే సరిపోతుంది.
 
ప్ర) ఫ్లూ అనే అనుమానం వచ్చాక, వైద్యులను సంప్రదించడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
 
జ) ఆవిరి పట్టడం , వేడి నీళ్లలో ఉప్పు వేసుకుని పుక్కిలించడం, నీళ్లు ఎక్కువ తాగడం, పర్సనల్ హైజీన్, మాస్కులు ధరించడం, సరైన అవగాహన,మన వంతు కృషి తప్పనిసరి.
 
ప్ర) ఈ సీజన్లో వచ్చే ఫ్లూలలో ప్రాణాంతకమైనవి ఏమైనా వున్నాయా?
 
జ) ఇన్ఫల్యూఎం జా ఏ మరియు  బి వైరస్లు ప్రమాదకరమైనవి. ఫ్లూ టీకా వీటి కొరకే తయారు చేయబడింది.
 
ప్ర) ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఫ్లూ సమస్యలకు దూరంగా వుండొచ్చు?
 
జ) అల్లం, వెల్లుల్లి, సూప్ లు , విటమిన్ సి ఎక్కువగా ఉండే సంత్ర,బత్తాయి, గ్రేప్ ఫ్రూట్ ,కివి మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. ఆకు కూరలు, ఓట్ మీల్ మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. మద్యం, ప్రొసెస్డ్ ఆహరం తక్కువగా తినడం మంచిది. 
 
ప్ర) పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ వల్ల కలిగే సమస్యలు ఎక్కువ, వారి విషయంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
 
జ) ముందర చెప్పిన విధంగా మాస్కులు ధరించడం, వీలైనంత వ్యక్తిగత శుభ్రత , ఇసోలేషిన్ , పౌష్టికమైన ఆహరం ,ఎక్కువ గ ద్రవ పదార్థాలు తీసుకోడం , వైద్యుల సహాయం వలన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు మరియు వయసు పైబడిన వారికీ  కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. వాక్సినేషన్ అత్యంత కీలకం కావున అందరు ఫ్లూ మరియు కోవిడ్ టీకా తప్పకుండా వేయించుకోండి.
 
--డా.రవి తేజ తంగిరాల( సీనియర్ జనరల్ ప్రాక్టీషనర్,ప్రైమ్ మెడికల్ సెంటర్, దుబాయ్)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com