అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా సాహిత్య పునరుజ్జీవం జరగాలి:ఉపరాష్ట్రపతి
- October 24, 2021
న్యూఢిల్లీ: అందరికీ అందుబాటులోకి వచ్చేవిధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ రూపొందించిన 100వ పుస్తకాన్ని న్యూఢిల్లీ నుంచి అంతర్జాల వేదిక ద్వారా గౌరవ ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 2020 అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి – సింగపూర్, తెలుగు మల్లి – ఆస్ట్రేలియా, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య - యునైటెడ్ కి౦గ్ డమ్, దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక - జొహానెస్ బర్గ్ వారు సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, 27 ఏళ్ళుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమౌతుందన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలని సూచించారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మన పదసంపదను సైతం ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు.
నిద్ర లేచింది మొదలు మన వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించిన ఆయన, ఈ పుస్తక సంపాదకులకు, రచయితలకు, ప్రచురణకర్తలకు అభినందనలు తెలిపారు.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు వంశీరామరాజు సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..