అమెరికాలో ఏపీ వాసి దారుణ హత్య

- October 31, 2021 , by Maagulf
అమెరికాలో ఏపీ వాసి దారుణ హత్య

అమెరికా: గుంటూరు జిల్లాకు చెందిన శ్రీరంగ అరవపల్లి అమెరికాలోని న్యూయార్క్ ప్లెయిన్స్‌బ‌రోలో స్థిర‌ప‌డ్డారు. హైద‌రాబాద్‌కు చెందిన‌ ఆరెక్స్ ల్యాబొరేట‌రీ కంపెనీలో సీఈవోగా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న ఇంటికి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న పెన్సెల్వేనియాకు వెళ్లిన శ్రీరంగ‌..పార్క్ క్యాసినో ఆడి దాదాపు 7.4 ల‌క్ష‌లు ( 10వేల అమెరిక‌న్ డాల‌ర్లు ) గెలుచుకున్నాడు. ఇది గ‌మ‌నించిన ఓ దుండుగుడు శ్రీరంగను ఫాలో అయ్యాడు. అత‌ని కారు వెనుక అనుస‌రిస్తూ అత‌ని ఇంటికి వెళ్లాడు.

శ్రీరంగ ఇంట్లోకి వెళ్ల‌గానే బ్యాక్‌డోర్ ప‌గుల‌గొట్టుకుని ఇంటి లోప‌లికి వెళ్లాడు. డ‌బ్బుల కోసం శ్రీరంగ‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అత‌నిపై కాల్పులు జ‌రిపి దుండ‌గుడు పారిపోయాడు. కాల్పుల శ‌బ్దం విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో శ్రీరంగ ఇంటికి వ‌చ్చిన పోలీసులు.. అత‌న్ని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ తీవ్ర‌గాయాలు కావ‌డంతో అప్ప‌టికే ఆయ‌న మృతిచెందాడు. పోలీసులు దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని పెన్సిల్వేనియాలోని నోరిస్‌టౌన్‌కు చెందిన జెకయ్ రీడ్ (27)గా గుర్తించారు.

శ్రీరంగం మృతిపై ప్లెయిన్స్‌బోరో టౌన్‌షిప్ పోలీస్ విభాగం చీఫ్ ఫ్రెడిరిక్ తవెనెర్ సంతాపం తెలిపారు. ‘అరవపల్లి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ఇది వారి కుటుంబం, స్నేహితులు సహా మా కమ్యూనిటీకి ఊహించని, ఆందోళన కలిగించే సంఘటన’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెక్స్ ల్యాబొరేటరీకి 2014 నుంచి సీఈఓగా ఉన్న శ్రీరంగం అరవపల్లికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన హత్యకు గురైన విషయం మమ్మల్ని షాక్‌కు గురిచేసిందని పొరుగింటి వ్యక్తి షీజా ఖాన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com