తెరచుకున్న అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు..భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఇవే!

- November 03, 2021 , by Maagulf
తెరచుకున్న అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు..భక్తులు పాటించాల్సిన నిబంధనలు ఇవే!

తిరువనంతపురం: కేరళలోని పథనంథిట్ట జిల్లాలోని దట్టమైన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, కేరళ దేవస్వొం బోర్డు అధికారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మణికంఠుడి ఆలయం తలుపులను తెరిచారు. స్వామివారి దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు.

నిబంధనలు తప్పనిసరిగా..
రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. ఆ తరువాత హరివరాసనం పూజలతో ఆలయ తలుపులను మూసివేస్తారు. చితిర అట్టావిశేష పూజల కోసం శబరిగిరీషుడి ఆలయం తలుపులు కొద్దిసేపటి కిందటే తెరచుకున్నాయి. వర్చువల్ క్యూ బుకింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు అనుమతిని ఇస్తున్నారు. స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేవస్వొం అధికారులు కొన్ని నిబంధనలను రూపొందించారు.

ఆర్టీపీసీఆర్
భక్తులు తప్పనిసరిగా వాటిని అనుసరించాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించని వారికి స్వామివారి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు. అయ్యప్పుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా వాటిని పాటించాల్సి ఉంటుంది. దర్శనం చేసుకోవాల్సిన సమయం నుంచి 72 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అక్కడి సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. లేదా- రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్‌ను ఇవ్వాలి.

సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే..
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న భక్తులు.. ఇక ప్రత్యేకించి- ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలను చూపించాలి. వ్యాక్సిన్ వేసుకోని వారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ అందజేయాలి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా ఈ కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అందజేయాలి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు అధికారులు.

అత్యవసర చికిత్స కేంద్రాలు..
శబరిమలకు వెళ్లే మార్గంలో ఉన్న నీలక్కళ్ వద్ద అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ 19 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయిదు అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి వైద్య చికిత్స అవసరమైన ఈ కేంద్రాల ద్వారా అందిస్తారు. దీనితోపాటు పంప నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలోనూ అత్యవసర వైద్య చికిత్స, ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రథమ చికిత్సను అందించడం, బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేయడం, గుండెపోటుకు గురయ్యే వారి కోసం ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నరల్ డీఫైబ్రిలేటర్‌ సౌకర్యాలను కల్పించారు.

రవాణా సౌకర్యం..
భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చేయడానికి కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 470 బస్సులను ఏర్పాటు చేసింది. వేర్వేరు నగరాలు, పట్టణాల నుంచి నేరుగా పంప వరకు ఈ బస్సులు నడుస్తాయి. నీలక్కళ్ నుంచి పంపా బేస్ క్యాంప్ వరకు షటిల్ సర్వీసుల కోసం 140 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సారి మండలం-మకరవిళక్కు సమయంలో కనీసం 10 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com