కాప్‌26 సదస్సు: ప్రపంచ నాయకులను ప్రసంగంతో ఆకట్టుకున్న తమిళ అమ్మాయి

- November 03, 2021 , by Maagulf
కాప్‌26 సదస్సు: ప్రపంచ నాయకులను ప్రసంగంతో ఆకట్టుకున్న తమిళ అమ్మాయి

న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల అంశంపై గ్లాస్గోలో కాప్‌26 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ ఇండియా తరపున తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

పలు అంశాలపై మాట్లాడిన ఆమె తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నది. వాగ్దాలను నిలబెట్టుకోలేకపోతున్న ప్రపంచ నేతలపై నేటి తరం యువత ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నది. ఈ భూగోళాన్ని రక్షించేందుకు నేతలంతా యాక్షన్‌లోకి దిగాలని వినీషా తన ప్రసంగంలో తెలిపింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరైన ఈ ఈవెంట్‌లో .. వారి సమక్షంలోనే వినీషా తన శక్తివంతమైన ప్రసంగాన్ని వినిపించింది.

సౌరశక్తితో నడిచే వాహనాన్ని తయారు చేసిన వినీషాకు ఇటీవల ఎర్త్‌స్పాట్ ప్రైజ్ దక్కింది. ఆ అవార్డులను ఎకో ఆస్కార్లుగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఎనర్జీ అంశంపై మాట్లాడాలని ప్రిన్స్ విలియమ్స్ కాప్ సదస్సుకు ఆ అమ్మాయిని ఆహ్వానించారు. ఎంతో మర్యాదపూర్వంగా ప్రపంచ నేతలను అడగాలనుకుంటున్నానని, ఇక నుంచి మాట్లాడడం మానేసి, చేతల్లో చేసి చూపించాలని ఆ అమ్మాయి పేర్కొన్నది. ఎర్త్‌షాట్ ప్రైజ్‌లు గెలిచినవాళ్లు, ఫైనలిస్టులు ఎన్నో రకాల ఆవిష్కరణలు, ప్రాజెక్టులు చేశారని, వారి వద్ద ఎన్నో పరిష్కారాలు కూడా ఉన్నాయని, అయితే పాత పద్ధతుల్లో ఆలోచన చేయడం మానివేయాలని, కొత్త భవిష్యత్తు కోసం కొత్త విజన్‌ను రూపొందించాలని వినీషా తన ప్రసంగంలో పేర్కొన్నది. మా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను పెట్టుబడిగా పెట్టాలని ఆమె ప్రపంచ నేతలను కోరింది.

వీధి వ్యాపారుల కోసం వినీషా ఉమాశంకర్ ఓ ఇస్త్రీ బండిని డిజైన్ చేసింది. అది సౌరశక్తితో నడుస్తుంది. సౌర విద్యుత్తుతో ఇస్త్రీ పెట్టన వాడవచ్చు. వినీషా డిజైన్ చేసిన బండికి ఈర్త్‌షాట్ ప్రైజ్ అవార్డు దక్కింది. ఈ బండి వల్ల బొగ్గు వినియోగం ఉండదు. దీంతో వాతావరణ సమస్యలు తగ్గుతాయి. సూర్యుడి నుంచి వెలుబడే కిరణాలతోనే శుద్ధ శక్తిని వినియోగించనున్నట్లు వినీషా తెలిపింది.

వాతావరణ మార్పులపై ఆవేశంగా మాట్లాడిన వినీషా.. తమ తరానికి చెందిన అనేక మంది యువత ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పింది. ప్రపంచ దేశాధినేతలు తమ వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆమె చెప్పింది. తాము ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కారణం ఉందని, కానీ ఆగ్రహం వ్యక్తం చేసే సమయం లేదని, కార్యాచరణకి దిగాలని, కేవలం నేను ఇండియాకు చెందిన అమ్మాయిని కాదు అని, ఈ భూమిపై పుట్టిన పుత్రికను అని, దానికి నేను గర్విస్తున్నాని వినీషా చెప్పింది. తాను ఒక విద్యార్థిని ఆవిష్కర్తను, పర్యావరణవేత్తను, ఔత్సాహిక వ్యాపారవేత్తను, ముఖ్యంగా తాను ఆశావాదిని అంటూ వినీషా శక్తివంతమైన ప్రసంగం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com