'రాజా విక్రమార్క' రివ్యూ

- November 12, 2021 , by Maagulf
\'రాజా విక్రమార్క\' రివ్యూ

ప్రధాన తారాగణం: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ల భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్, పశుపతి తదితరులు 
ఎడిటర్:జస్విన్ ప్రభు 
కెమెరా: పీసీ మౌళి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్, సినారే 
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి

'ఆర్ఎక్స్ 100'తో హీరో కార్తికేయ గుమ్మకొండ భారీ విజయం అందుకున్నారు. విజయంతో పాటు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు నటుడిగా ఆయనకు పేరు తీసుకొచ్చినా... కమర్షియల్ లెక్కల పరంగా ఆశించిన విజయాలు అందుకోలేదు. మరి, 'రాజా విక్రమార్క' ఎలా ఉంది? నటుడిగా కార్తికేయకు పేరుతో పాటు విజయం తీసుకొచ్చేలా ఉందా? లేదా? 

కథ: విక్రమ్... రాజా విక్రమార్క (కార్తికేయ గుమ్మకొండ) ఎన్.ఐ.ఎలో కొత్తగా చేరిన ఉద్యోగి. పై అధికారి మహేంద్ర (తనికెళ్ల భరణి)ని 'బాబాయ్ బాబాయ్' అని పిలిచేంత చనువు అతనికి ఉంది. హైద‌రాబాద్‌లో అక్రమంగా ఆయుధాలు అమ్ముతున్న నల్ల జాతీయుడిని ఎన్.ఐ.ఎ బృందం పట్టుకుంది. అతడిని విచారించే క్రమంలో విక్రమ్ చేతిలో ఉన్న గన్ పొరపాటున పేలుతుంది. బుల్లెట్ తగిలి మరణిస్తాడు. అయితే... మరణించే ముందు మాజీ నక్సలైట్ గురు నారాయణ (పశుపతి)ని చూశానని చెబుతాడు. అతడి వల్ల హోమ్ మినిస్టర్ చక్రవర్తి (సాయి కుమార్)కు పొంచిఉన్న ప్రమాదం ఏమిటి? వాళ్లిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది? గురు నారాయణను  ఎన్.ఐ.ఎ ఎలా అడ్డుకుంది? హోమ్ మినిస్టర్ చక్రవర్తిని కాపాడే క్రమంలో ఆయన కుమార్తె కాంతి (తాన్యా రవిచంద్రన్)ని విక్రమ్ ప్రేమలో ఎలా పడేశాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా సినిమా.  

విశ్లేషణ: ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)... ఇప్పటివరకూ తెలుగు తెరపై ఎన్.ఐ.ఎ ఏజెంట్స్ అంటే తీవ్రవాదుల మీద చేసే పోరాటాన్ని చూపించారు. దేశం లోపల కూడా ఎన్.ఐ.ఎ ఏజెంట్స్ పని చేస్తారని 'రాజా విక్రమార్క'లో చూపించారు. దర్శకుడు శ్రీ సరిపల్లి తీసుకున్న పాయింట్ బావుంది. కానీ, తీసే విధానంలో కొంత తడబడ్డాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో! హీరో ఎన్.ఐ.ఎ ఏజెంట్ అని తెలిశాక... 'నువ్వు ఎన్.ఐ.ఎ ఏజెంట్ అంటే నమ్మశక్యంగా లేదు' అని అంటుంది. ఫస్టాఫ్ చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు కూడా సేమ్ డౌట్ కలుగుతుంది. అతడికి ఎన్.ఐ.ఎలో ఎలా ఉద్యోగం వచ్చిందని! అతని క్యారెక్టరైజేషన్ మీద పైఅధికారి కూడా పంచ్ వేస్తాడు. హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం ఇప్పటివరకూ చూసిన ఎన్.ఐ.ఎ ఏజెంట్స్‌కు డిఫ‌రెంట్‌గా ఉంది. అందువల్ల, కొన్ని నవ్వులు క్రియేట్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా ఎన్.ఐ.ఎ కంటే హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథే ఎక్కువ. రాజావారి ప్రేమ కహాని సోసోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సెకండాఫ్‌లో రాజావారి వేట మాత్రం ఆసక్తిగా కొనసాగింది. ఎన్.ఐ.ఎ అంటే సీరియస్ వ్యవహారంలా కాకుండా కమర్షియల్ హంగులు జోడించి సినిమా తీశారు. సెకండాఫ్ మలుపులతో డీసెంట్‌గా సాగింది. అయితే... మరింత రేసీగా ఉండి ఉంటే బావుండేది.  

దర్శకుడు శ్రీ సరిపల్లికి టెక్నికల్ టీమ్ నుంచి సూపర్బ్ సపోర్ట్ లభించింది. పీసీ మౌళి సినిమాటోగ్రాఫీ బావుంది. ప్రతి ఫ్రేమ్ చాలా స్ట‌యిలిష్‌గా, రిచ్‌గా తీశారు. ఆ సన్నివేశాలకు ప్రశాంత్ ఆర్. విహారి చక్కటి నేపథ్య సంగీతం అందించారు. ఇక, పాటల్లో వైవిధ్యం చూపించారు. 'రామా... వినవేమిరా' క్లాసికల్ సాంగ్, 'రాజా గారు వేటకొస్తే...' పాటలు బావున్నాయి. రామారెడ్డి, ఆదిరెడ్డి ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. కార్తికేయ‌, తాన్యా ర‌విచంద్ర‌న్ స్ట‌యిలింగ్ బావుంది. ఇద్దర్నీ స్టయిలిష్‌గా చూపించారు. క్లైమాక్స్ ఫైట్, ఫారెస్ట్‌లో గన్ ఫైరింగ్ సీక్వెన్స్, డంప్ యార్డ్‌లో షూట్ అవుట్... యాక్షన్ దృశ్యాలు స్ట‌యిలిష్‌గా ఉన్నాయి.

కార్తికేయ అందంగా కనిపించారు. ఓ స‌న్నివేశంలో సిక్స్‌ప్యాక్ చూపించారు. ప్రేమ సన్నివేశాల్లో పర్వాలేదు. బాగా చేశారు. యాక్షన్ సన్నివేశాలు, ఎన్.ఐ.ఎ సీన్స్‌లో ఎక్స్‌లెంట్‌గా చేశారు. కార్తికేయ తర్వాత సుధాకర్ కొమాకులది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాలి. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించారు. మొదట అండర్ ప్లే చేసి... క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత యాక్టింగ్‌లో వేరియేష‌న్‌ చూపించారు. తాన్యా రవిచంద్రన్ రెగ్యుల‌ర్ హీరోయిన్‌లా కాకుండా... స‌గ‌టు అమ్మాయిలా క‌నిపించారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతిల నటనలో అనుభవం కనిపించింది. హర్షవర్ధన్ కామెడీ టైమింగ్ బావుంది. అయితే... ఆయనపై తీసిన సన్నివేశాలు, ఆ ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్స్ గతంలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

'రాజా విక్రమార్క' గురించి చెప్పాలంటే... రాజావారి వేట బావుంది. అయితే... రాజా గారి ప్రేమ కథ కొంత రొటీన్‌గా ఉంటుంది. ప్రేమకథ ముందు వస్తుంది కాబట్టి... సెకండాఫ్‌లో వేట మొదలైన తర్వాత ప్రేక్షకులకు మజా మొదలవుతుంది. మంచి పాటలు, ఫైటులతో ఉన్న సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు స్టయిలిష్ యాక్షన్ కామెడీ చూసినట్టు ఉంటుంది. హీరోగా కార్తికేయకు మరోసారి పేరు వస్తుంది. 

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com