అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసే సామర్థ్యం భారతదేశం సొంతం: ఉపరాష్ట్రపతి
- November 17, 2021
*స్వదేశీ ప్రాంతీయ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ‘నావిక్’ అంతర్జాతీయ వినియోగానికి చొరవ తీసుకోవాలి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
*అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసే సామర్థ్యం భారతదేశం సొంతమన్న ఉపరాష్ట్రపతి
*ఈ రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా కృషి జరగాలని ఇస్రో బాధ్యులకు ఉపరాష్ట్రపతి సూచన
*బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి..శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి
బెంగళూరు: స్వదేశీ తయారీ నేవిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ‘నావిక్’ను అంతర్జాతీయంగా వినియోగించేలా చొరవతీసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడారు.

నావిక్ ఉపగ్రహ వ్యవస్థను వినియోగంలోకి తీసుకొచ్చిన ఇస్రోను హృదయపూర్వకంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, దీన్ని అంతర్జాతీయంగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ వ్యవస్థను మరింత విస్తరించే దిశగా కృషిచేయాలని కూడా ఆయన సూచించారు.
అంతరిక్షరంగానికి సంబంధించి అపారమైన శక్తి, సామర్థ్యాలున్న భారత్.. తన శక్తిమేరకు సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భరత సాధించే దిశగా మరింత కృషిచేయాలని ఆయన సూచించారు.
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అంశంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాన్ని ఇవ్వడం గొప్ప పరిణామమన్న ఉపరాష్ట్రపతి.. ఇందుకు గానూ ఇస్రోను అభినందించారు. వివిధ ప్రయోగాలకు గానూ ఇస్రో అంతర్జాతీయంగా మంచిపేరు సంపాదించుకున్న విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఉపగ్రహాల పనితీరు పర్యవేక్షణ, ఇతర శాస్త్రపరమైన మిషన్లు, ప్రయోగాలకు సంబంధించిన మిషన్లు, డీప్ స్పేస్ మిషన్లకు సంబంధించిన విషయంలో యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రంగా జరుగుతున్న కృషిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. భారతదేశానికి టెలికమ్యూనికేషన్స్, ప్రసార మాధ్యమాలు, వాతావరణం, రిమోట్ సెన్సింగ్, నేవిగేషన్, స్పేస్ సైన్స్ తదితర అంశాల్లో ఇస్రో ద్వారా జరుగుతున్న మేలును ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
వివిధ ఉపగ్రహాల ద్వారా అందుతున్న వాతావరణ వార్తలను తెలియజేయడం ద్వారా ప్రమాదాల విషయంలో ప్రజలను ముందుగానే హెచ్చరించేందుకు వీలు కలుగుతోందన్నారు. ఈ దిశగా మరింత కృషి చేయడం ద్వారా రైతులకు వాతావరణ మార్పుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు.
తర్వాతి తరం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలు, చంద్రుడిపై ప్రయోగాలకోసం చంద్రయాన్-3, సూర్యుడిపై ప్రయోగాల కోసం పంపిస్తున్న ఆదిత్య-1 (వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు) తదితర ప్రయోగాలకోసం యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రంగా జరుగుతున్న ప్రయోగాలను మరోసారి ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్, యూఆర్ రావ్ ఉగ్రహ కేంద్రం సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- ఒమన్ లో ఆసియా జాతీయులు అరెస్టు..!!
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!









