కేవలం రెండురోజుల్లో పర్మిషన్...

- March 22, 2016 , by Maagulf
కేవలం రెండురోజుల్లో పర్మిషన్...

షూటింగులకు పర్మిషన్ తీసుకోవాలంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన 48 గంటల్లోనే ఎంచక్కా షూటింగ్ చేసుకోవచ్చు.. దీనివల్ల నిర్మాతకు భారం తగ్గనుంది. సకాలంలో ఎక్కువ సినిమాలు థియేటర్స్ వచ్చే ఛాన్స్ వుంది. అధికారుల నుంచి అనుమతి వచ్చేసరికి ఒక్కోసారి నెలరోజుల సైతం పట్టేంది.. ఆ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం సడలించింది. ఫిల్మ్ ఇండస్ర్టీ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, తుమ్మల, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌, చలన చిత్ర ప్రముఖులు దాసరి నారాయణరావు, సురేష్‌బాబు, మురళీమోహన్‌, ఆదిశేషగిరిరావు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజలు పాల్గొన్నారు.ఇకపై పోలీసు, పర్యాటక, అటవీ, పురపాలక, పురావస్తు శాఖల పరిధిలో షూటింగుల కోసం ఎఫ్‌డీసీకి దరఖాస్తు చేసుకుంటే.. 48 గంటల్లో అనుమతులు ఇవ్వాలని ఉపసంఘం కోరింది. అలాగే చిన్న చిత్రాల కోసం ప్రతీ థియేటర్‌లో ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతించాలని తెలిపింది. ప్రతీరోజు సాయంత్రం నాలుగు గంటలకు దీనిని ప్రదర్శించనున్నారు. మరోవైపు పుణె ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ తరహాలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌కు స్థల సేకరణ, నిర్మాణ విధివిధానాల రూపకల్పనకు ఉప కమిటీ ఏర్పాటైంది. టాలీవుడ్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని ఇండస్ర్టీ భావిస్తోంది. తమ సినిమాల నిర్మాణానికి ఇది మంచి అవకాశమని చెప్పుకుంటున్నారు. కేవలం రెండురోజుల్లో పర్మిషన్ అంటే మాటలుకాదని, ఇప్పుడు అసాధ్యం సుసాధ్యమైందని నిర్మాతల మండలి భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com