జూమ్ కాల్ లో ఉద్యోగాలు పీకేసిన యజమాని.. ఇప్పుడు క్షమాపణలు

- December 09, 2021 , by Maagulf
జూమ్ కాల్ లో ఉద్యోగాలు పీకేసిన యజమాని.. ఇప్పుడు క్షమాపణలు

న్యూ యార్క్: కొద్దిరోజుల కిందట జూమ్ కాల్ లో 900 మంది ఉద్యోగులను తీసేస్తూ అనౌన్స్మెంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాల సంస్థ బెటర్‌.కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ తమ ఉద్యోగులకు జూమ్‌ కాల్‌ లో షాక్ ఇచ్చారు.

ఏకంగా 900 మంది ఉద్యోగులను తీసేసినట్టు చెప్పారు. ఉద్యోగాలు తీసేసిన వారిలో భారత్, యునైటెడ్ స్టేట్స్‌లోని వారు ఉన్నారు. సమర్థత, పనితీరు సరిగా లేని వారిని విశాల్‌ విధుల నుంచి తప్పించారని అన్నారు. ఉద్యోగులకు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వారి తొలగిస్తున్నట్లు చెప్పారని ఉద్యోగులు వాపోతున్నారు. అమెరికాతో పాటూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సెలవు సీజన్ ప్రారంభం కానున్న సమయంలో విశాల్ గార్గ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. "ప్రస్తుతం కాల్‌లో ఉన్నవారు ఈ వార్త వినాలనుకోరు. దురదృష్టవశాత్తూ ఈ కాల్‌ గ్రూప్‌లో ఉన్నవారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం. ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడం నా కెరీర్‌లో ఇది రెండోసారి. గతంలో నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డా. ఒకానొక సమయంలో ఏడ్చాను కూడా. కానీ ఇప్పుడు మాత్రం బలంగా ఉండాలని ముందే నిర్ణయం తీసుకున్నా. మార్కెట్ మారిపోయింది. మనుగడ సాగించడానికి మేము దానితో పాటుగా పరుగెత్తాలి. అప్పుడే కంపెనీ అభివృద్ధి చెందుతుంది. ఇది నిజంగా సవాలుతో కూడుకున్న నిర్ణయం. మార్కెట్‌, సమర్థత, పనితీరు తదితర కారణాలతో కంపెనీలోని 15 శాతం సిబ్బందిని తొలగిస్తున్నాం" అని విశాల్ గార్గ్‌ జూమ్‌ కాల్‌లో ఉద్యోగులకు చెప్పారు. కంపెనీ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను విశాల్‌ గార్గ్‌ తొలగించారట. అయితే సీఈవో చెప్పినట్లు 15శాతం సిబ్బందిని కాకుండా 9శాతం సిబ్బందిని మాత్రమే తొలగించినట్లు ఆ కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

వీడియో విపరీతంగా వైరల్ అవ్వడం.. ఉద్యోగులను ఉన్నట్లుండి తీసి వేస్తూ ఇలా ఎవరైనా చెబుతారా అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో విశాల్ గార్గ్ క్షమాపణలు చెప్పుకొచ్చారు. తాను అలా చెప్పి ఉండకూడదని అన్నారు. సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల కంపెనీ వీడియో కాల్ ద్వారా 9 శాతం మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తీవ్ర విమర్శలకు గురైన విశాల్ గార్గ్, తొలగింపుల గురించి కమ్యూనికేట్ చేయడంలో తప్పుగా ప్రవర్తించానని అన్నారు. నేను ఈ వార్తను కమ్యూనికేట్ చేసిన విధానం పరిస్థితులను.. మరింత దిగజార్చిందని నేను గ్రహించాను అని.. క్షమాపణలు చెబుతూ గార్గ్ ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com