సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

- December 11, 2021 , by Maagulf
సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జగన్ ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఇక అందుకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ సాయితేజ కుటుంబానికి అందించారు.

వారిని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం బెంగళూరులోని ఎలహంక ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది. రేపు ఉదయం అక్కడ నుంచి అతడి స్వగ్రామానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా, డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‎లోని చిత్తూరు జిల్లా చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ ఈ ప్రమాదంలో మరణించారు. అతని భౌతికకాయం నేడు స్వగ్రామం ఎగువరేగడికి తీసుకురానున్నారు. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయి తేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు.

లాన్స్ నాయక్ సాయితేజ అకాల మరణం..అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన సాయితేజ… ఆకస్మికంగా తనువు చాలించడం.. అందరినీ కలచివేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉంటూ.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అనుకోని ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం తమను తీవ్ర విషాదంలోకి నెట్టందని కుటుంసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com