కోర్టులో బాంబు పెట్టిన ఆ శాస్త్రవేత్త.. జైల్లో ఆత్మహత్యాయత్నం

- December 20, 2021 , by Maagulf
కోర్టులో బాంబు పెట్టిన ఆ శాస్త్రవేత్త.. జైల్లో ఆత్మహత్యాయత్నం

న్యూ ఢిల్లీ: ఒక న్యాయవాదిని లక్ష్యంగా చేసుకొని దిల్లీలోని రోహిణీ జిల్లా కోర్టులో బాంబు పెట్టిన డీఆర్‌డీవో సీనియర్‌ శాస్త్రవేత్త భరత్‌ భూషణ్‌ కటారియా జైల్లో ఆత్మహత్యకు యత్నించాడు.

హ్యాండ్ వాష్‌ను తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని పోలీసులు ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

రోహిణీ కోర్టులో టిఫిన్స్‌ బాక్సు బాంబు పెట్టిన కేసులో భరత్‌ను గత శుక్రవారం దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, శనివారం రాత్రి వాష్‌రూంకు వెళ్లిన భరత్‌.. అపస్మారక స్థితిలో పడిపోయాడు. పోలీసులు ఏమైందని ప్రశ్నించగా.. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆసుపత్రికి తరలించగా.. ఎయిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. అతడు లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌ను సేవించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత విచారణ కొనసాగించనున్నట్లు చెప్పారు.

ఈ నెల 9వ తేదీన రోహిణీ కోర్టులో బాంబు పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. న్యాయవాదితో ఉన్న పాతకక్షల కారణంగా భరత్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో భరత్ నివాసముంటున్నారు. ఆయన పొరుగింట్లో ఉండే ఓ న్యాయవాదితో ఈయనకు గతకొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. వీరిద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాదిని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో భరత్‌ ఈ బాంబు పేలుడుకు కుట్ర పన్నాడు. ఈ పేలుడు ఘటనలో ఒకరు గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com