భాషా ఐకమత్యాన్నిపెంచేందుకు మరింత కృషిజరగాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి
- January 04, 2022
మహారాష్ట్ర: మాతృభాషలోనే ప్రాథమిక విద్యావిధానం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమంటూ మహాత్మాగాంధీ సూచించిన ‘నయీ తాలీమ్’ను నూతన జాతీయ విద్యావిధానం ప్రతిబింబిస్తోందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని వర్ధాలో ఉన్న మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి అంతర్జాల మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయ ఆవరణలో నిర్మించిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి పేరుతో నిర్మించిన భవనాన్ని, స్వాతంత్ర్య పోరాట యోధుడు ఆజాద్ చంద్రశేఖర్ పేరుతో నిర్మించిన విద్యార్థుల వసతిగృహ సముదాయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
అనంతరం ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. 1937లో వర్ధాలో జరిగిన కార్యక్రమంలోనే మహాత్మాగాంధీ ‘నయీ తాలీమ్’ను ప్రతిపాదించారని గుర్తుచేశారు.ప్రతి ఒక్కరికీ విద్యను ఉచితంగా, తప్పనిసరిగా అందించడం, ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే ఉండాలని చెప్పడం, దీంతోపాటుగా నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నాడు మహాత్ముడు బోధించడం నేటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందన్నారు.భారతదేశ స్వరాజ్య సంగ్రామం గ్రామ గ్రామాలకు వెళ్లడంలో ఆయా ప్రాంతాల్లోని మాతృభాషల ప్రభావం ఎంతగానో ఉందని.. గాంధీ పేర్కొన్నారన్నారు.
భారత రాజ్యాంగసభ కూడా తీవ్రంగా చర్చించిన తర్వాత హిందీ భాషకు దేశభాష హోదాను కట్టబెట్టడంతోపాటు ఇతర భారతీయ భాషలకు కూడా రాజ్యాంగ హోదాను కట్టబెడుతూ ఎనిమిదవ షెడ్యూల్ లో పొందుపరిచిన విషయాలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ప్రతి భారతీయ భాషకూ ఉన్నతమైన, వైభవోపేతమైన సాహిత్యం ఉందని, ఇలాంటి సాహిత్యాన్ని ఆయా భాషల్లో ఉన్నవారు అధ్యయనం చేయడంతోపాటు ఇతర భాషల్లోకి వీటిని అనువాదం చేయడం ద్వారా భారతీయులందరికీ మన సాహిత్య సమృద్ధిని అందజేసినట్లుంటుందన్నారు. భాషావైవిధ్యతే భారతదేశానికి బలమని, ఇదే మన సాంస్కృతిక వైవిధ్యతకు ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి అన్నారు.
సమసమాజ స్థాపనలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుందని ఇందుకోసం మృదుమధురమై, విలువలు కలిగి, సృజనాత్మకమైన భాష అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, హుందాతనంతో పదాలను వాడుతూ తమ భావప్రకటన స్వేచ్ఛను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పులు తీసుకురాగలమని బలంగా విశ్వసించారని, ఇందుకు మాతృభాషకే వారుకూడా ప్రాధాన్యత ఇచ్చారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన అంబేడ్కర్ విగ్రహం, విద్యార్థులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అభిలషించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గారు భారతీయ భాషలకు గౌరవం దక్కాలన్న ఆకాంక్షతో ఐక్యరాజ్యసమితి సమావేశంలో తొలిసారి హిందీ మాట్లాడారన్నారు. ఆ తర్వాత ఐరాస సమావేశాల్లో, ఇతర అంతర్జాతీయ వేడుకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడుతున్నారన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో తమవంతు భూమిక పోషించాలని ఉపరాష్ట్రపతి అభిలషించారు.
హిందీ భాషలోని సాహిత్యాన్ని ఆన్ లైన్లో అందుబాటులోకి తేవడం ద్వారా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నవారికి సాహిత్యంలోని ప్రతి కోణాన్ని తెలుసుకునేందుకు సహాయం చేస్తున్న ఈ విశ్వవిద్యాలయ బాధ్యులను ఉపరాష్ట్రపతి అభినందించారు.ఈ ప్రయత్నం ఇతర భారతీయ భాషల్లోనూ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జాపనీస్ తదితర అంతర్జాతీయ భాషలను హిందీ మాధ్యమం ద్వారా బోధిస్తున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులను కూడా ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అఠావలే, వర్ధా ఎంపీ రాందాస్ తాడస్, విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ రజనీశ్ కుమార్ శుక్లాతోపాటు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యక్షంగా, ఆన్ లైన్ వేదిక ద్వారా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!