చూస్తుంటే ఈసారి కూడా IPL మన దేశంలో డౌటే

- January 14, 2022 , by Maagulf
చూస్తుంటే ఈసారి కూడా IPL మన దేశంలో డౌటే

కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ విదేశాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. గత రెండు దఫాలు యూఏఈలో నిర్వహించిన యాజమాన్యం.. ఇక ఈసారి మాత్రం భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో దేశంలో మరోమారు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నెలకు కేసుల సంఖ్య విపరీతంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నాటికి దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గకపోతే కనుక ఈసారి కూడా టోర్నీని భారత్ వెలుపలే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. 
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఈ సారి కూడా విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో మరోసారి క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే, ఈసారి యూఏఈ కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఐపీఎల్ 2022 సీజన్ కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రతీ సారి ఆదేశంపై ఆధారపడటం సరికాదని బీసీసీఐ భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
భారత్‌లో సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2009 సీజన్‌ని దక్షిణాఫ్రికాలోనే బీసీసీఐ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో.. ఆ దేశానికే మరో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకవేళ దక్షిణాఫ్రికాలో నిర్వహించడం సాధ్యం కాకుంటే అప్పుడు శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా సమయం కూడా ఆటగాళ్లకు కలిసొస్తుంది అని బీసీసీఐ అధికారి తెలిపాడు.

సమయ భారం..
ఐపీఎల్‌లో అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు సాగుతున్నాయని గత కొంతకాలంగా ఆటగాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యకు దక్షిణాఫ్రికా కాలమానం పరిష్కారం కాగలదని బోర్డు భావిస్తుంది. దక్షిణాఫ్రికా కంటే భారత్‌ 3 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ను ప్రారంభించాలని భావిస్తే దక్షిణాఫ్రికాలో సాయంత్రం 4 గంటలకు తొలి బంతి పడుతుంది. కాబట్టి తొందరగానే మ్యాచ్‌లు ముగుస్తాయి.

అయితే, ఒమిక్రాన్ మొదటి కేసు నమోదైన దక్షిణాప్రికాలో ఈ టోర్ని నిర్వహించడం ఎంత వరకు సేఫ్ అంటూ పలువురు బీసీసీఐ ను ప్రశ్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com