రైతులకు శుభవార్త చెప్పిన టీటీడీ

- February 19, 2022 , by Maagulf
రైతులకు శుభవార్త చెప్పిన టీటీడీ

తిరుపతి అనగానే.. శ్రీవారి దర్శనం అనంతరం గుర్తుకొచ్చేది లడ్డూ. ఈ ప్రసాదాన్ని ప్రతొక్కరూ పరమ పవిత్రంగా భావిస్తుంటారు.

ఎవరైనా తిరుపతికి వెళ్లి వచ్చిన తర్వాత.. లడ్డూను పంచుతుంటారు. లడ్డూను మహిమాన్వితంగా భావిస్తుంటారు. ఈ లడ్డూ తయారీలో ఎన్నో పదార్థాలు వాడుతుంటారనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ప్రతొక్కటి ముఖ్యమైందే. చక్కెర, నెయ్యి, జీడిపప్పు, శనగపిండి ఇతరత్రా వాడుతుంటారు. శనగపిండికి పప్పు శనగను అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు. తమకు భాగస్వామ్యం దక్కుతుందన్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకృతి సిద్ధంగా సాగు చేసిస వాటినే టీటీడీ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అందుల భాగంగా శనగపప్పు పంటను సేకరించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జెడ్ బీఎస్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు. ఈయన సహకారంతో ఈ నెలాఖరుకు అవసరమైన పప్పు శనగను వెంకన్న సన్నిధికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పంటకు 400 కిలోల ఘన జీవామృతం, బీజా మృతంతో విత్తన శుద్ధి, ప్రతి 20 రోజులకోసారి జీవా మృతాన్ని పిచికారీ చేసి పప్పు శనగ పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా ఆవుపేడ, ఆవు మూత్రం, శనగపిండి లాంటి వాటితో తయారు చేసిన సేంద్రీయ పోషకాలతో పంట పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెలాఖరున పంట తొలగించి మార్పిడి చేసిన తర్వాత 1,396 క్వింటాళ్లు టీటీడీకి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, బహిరంగ మార్కెట్ లో ఉన్న ధర కన్నా 20 శాతం అధికంగా రైతులకు ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించిందన్నారు. తిరుమల వెంకన్న ప్రసాదంలో తాము పండించిన పప్పు శనగను వినియోగించనుండడంతో రైతులు అమితానాందం పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com