2021లో దేశీయ కార్గో రవాణాలో రికవరీ కొనసాగించిన హైదరాబాద్ ఎయిర్ కార్గో

- February 21, 2022 , by Maagulf
2021లో దేశీయ కార్గో రవాణాలో రికవరీ కొనసాగించిన హైదరాబాద్ ఎయిర్ కార్గో

హైదరాబాద్: కోవిడ్ వల్ల ఎదురైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని, GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) 2021 సంవత్సరంలో దేశీయ (డొమెస్టిక్) కార్గో ట్రాఫిక్‌ గణనీయంగా మెరుగుపడింది. 

మొదటి కోవిడ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో ట్రాఫిక్ సంఖ్య చాలా తగ్గింది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా దీనికి మినహాయింపు కాదు. ఏప్రిల్-మే 2021 మధ్య కాలంలో, దేశాన్ని తాకిన కోవిడ్ సెకెండ్ వేవ్ 2020 కనిష్ట స్థాయి నుంచి కోలుకుంటున్న విమానరంగాన్ని మళ్లీ దెబ్బ తీసి విమాన కనెక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసింది. మరీ ముఖ్యంగా, విమాన సర్వీసులు, ప్రయాణికులు, సరుకుల రాకపోకలపై పరిమితులతో అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ, సప్లై చెయిన్‌లకు అంతరాయం కలిగింది. ఈ సవాళ్లు ఎదురైనా, హైదరాబాద్ విమానాశ్రయం తన ఫ్లైట్ నెట్‌వర్క్, కార్గో కనెక్టివిటీని పునరుద్ధరించుకోవడమే కాకుండా దక్షిణ-మధ్య భారత ప్రాంతపు డొమెస్టిక్ విమాన కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా మారింది.

కోవిడ్‌కు ముందు 2020 మొదట్లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 55 దేశీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీ ఉండగా, 2021 చివరి నాటికి అది 65 గమ్యస్థానాలకు విస్తరించడం ప్రయాణీకులు, కార్గోపరంగా హైదరాబాద్ విమానాశ్రయానికి పెరిగిన ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.

2020తో పోలిస్తే హైదరాబాద్, కార్గో పరిణామం పరంగా ఏడాదికి 22% వృద్ధిని నమోదు చేసింది. 2019లో భారతదేశంలో 6వ అతిపెద్ద కార్గో హబ్‌గా ఉన్న హైదరాబాద్, ఇటీవల పెరిగిన వృద్ధి కారణంగా 5వ స్థానానికి ఎగబాకింది. వ్యూహాత్మకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కున్న భౌగోళిక స్థానం, మెరుగైన డొమెస్టిక్ ఎయిర్ నెట్‌వర్క్, ఇతర రవాణా మార్గాల కన్నా ఎయిర్ కార్గోకు కస్టమర్లు ప్రాధాన్యత ఇవ్వడం, ఈ-కామర్స్‌కు ఆదరణ పెరగడం వంటి అనుకూల కారణాలతో హైదరాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ కార్గోలో 35%తో బలమైన వృద్ధిని  నమోదు చేసింది. నిజానికి  హైదరాబాద్ విమానాశ్రయం 2021 డొమెస్టిక్ ఎయిర్ కార్గో పరిణామం, 2019లో కోవిడ్ ప్రారంభానికి ముందస్తు స్థాయిని మించిపోయి, ఈ క్రమంలో 2021లో దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మెట్రో విమానాశ్రయంగా మారింది.

2022లో, దేశంలోని అన్ని ముఖ్యమైన ఈ-కామర్స్ సప్లై చెయిన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ నగరం, హైదరాబాద్ విమానాశ్రయం ఆ ట్రెండ్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ-కామర్స్ పంపిణీ, సప్లై చెయిన్ కార్యకలాపాలకు హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా ఉద్భవించింది. దక్షిణ-మధ్య భారతదేశపు క్యాచ్‌మెంట్ ప్రాంతానికి సేవలందించే దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్ హైదరాబాద్ విమానాశ్రయంలోని ఎయిరోసిటీలో ఉండడం గమనార్హం.

అంతర్జాతీయంగా, ప్రత్యేకమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రత్యేకించి టెంపరేచర్-సెన్సిటివ్, క్లిష్టమైన షిప్‌మెంట్‌లను నిర్వహించగల సామర్థ్యం కలిగిన GHAC 2021లో దేశంలో అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ షిప్‌మెంట్‌లను సమర్థంగా హ్యాండిల్ చేసింది. 2021లో, GHAC మెరైన్ కార్గోతో సహా పెరిషబుల్స్‌లో బలమైన వృద్ధిని నమోదు చేసింది. 

డిమాండ్‌కు అనుగుణంగా, GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో నూతన మార్కెట్ సెగ్మంట్‌ల కోసం మరిన్ని పెట్టుబడులు పెడుతోంది. 

  • 2022లో, డెడికేటెడ్ అంతర్జాతీయ కొరియర్ టెర్మినల్ (ICT)ని ప్రారంభించడం ద్వారా GMR కార్గో టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎక్స్‌ప్రెస్ కార్గో హ్యాండ్లింగ్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.
  • దక్షిణ మధ్య భారతదేశంలో ఫార్మా ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ కార్గో, ఇటీవల టెంపరేచర్-కంట్రోల్డ్ కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాల విస్తరణ, అప్‌గ్రేడ్‌పై పెట్టుబడులు పెడుతోంది. ఇటీవల, మొత్తం ‘ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌’ను టెంపరేచర్ కంట్రోల్డ్ ప్రదేశంగా మార్చి, తద్వారా అలాంటి సదుపాయం కలిగిన దేశంలోని ఏకైక కార్గో టెర్మినల్‌గా అవతరించింది.
  • GHAC త్వరలో ప్రత్యేకమైన 'కూల్ కంటైనర్ యార్డ్'ను ప్రారంభించనుంది. దీని వల్ల హైదరాబాద్ టెంపరేచర్-కంట్రోల్డ్ ఎయిర్ కార్గో కంటైనర్‌ల విషయంలో దక్షిణ ఆసియాలో అతిపెద్ద ఆన్-ఎయిర్‌పోర్ట్ బేస్‌గా మారనుంది. దీని వల్ల ఔషధ రవాణాలో ప్రధానంగా ఉపయోగపడే ఈ కంటైనర్ యూనిట్‌లు స్థానిక ఫార్మా తయారీదారులు, ఫార్వార్డర్‌లు, విమానయాన సంస్థలకు అందుబాటులోకి వస్తాయి. 
  • రాబోయే దశాబ్దంలో పెరగబోయే డిమాండ్‌ను తీర్చడానికి మౌలిక సదుపాయాలు, సాంకేతికతతో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్స్‌ కెపాసిటీని పెంచడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా యోచిస్తోంది.

పైన పేర్కొన్న వ్యూహాత్మక ఎయిర్ కార్గో మౌలికసదుపాయాల కారణంగా, GHAC దక్షిణ, మధ్య భారతదేశంలో అతిపెద్ద ఎయిర్ కార్గో హబ్‌గా అవతరించడానికి సిద్ధమైంది.

ప్రదీప్ పణికర్, CEO-GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL), “క్లిష్టమైన సమయంలో కూడా హైదరాబాద్ ఎయిర్ కార్గో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. ఇది కార్గో, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 2022లో అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ సాధారణ స్థితికి చేరుకుంటుందని భావిస్తున్న నేపథ్యంతో, భవిష్యత్తు గురించి మేము చాలా ఆశావాద దృక్పథంతో ఉన్నాము. ఈ ప్రాంతపు అభివృద్ధి పథానికి అనుకూలంగా మా కార్గో టెర్మినల్ సౌకర్యాల విస్తరణ, అప్‌గ్రేడ్ కోసం మేం భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అన్నారు.

GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మెరుగైన నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) ద్వారా సర్టిఫై చేయబడిన విమానాశ్రయం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా వాటిని సరఫరా చేయడానికి ఇది సదుపాయాలను కలిగి ఉంది. పెరిషబుల్స్, వ్యవసాయోత్పత్తులు, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాల కోసం GHAC ల్యాండ్‌సైడ్ మరియు ఎయిర్‌సైడ్‌లో తన మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా  ఎయిర్ సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్, (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com