రష్యాను కట్టడిచేయలేకపోతున్న ప్రపంచ దేశాలు..వీటో పవర్ తో దూసుకుపోతున్న రష్యా

- February 26, 2022 , by Maagulf
రష్యాను కట్టడిచేయలేకపోతున్న ప్రపంచ దేశాలు..వీటో పవర్ తో దూసుకుపోతున్న రష్యా

యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యాను కంట్రోల్ చేద్దామనుకుంటున్న చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.

కాసేపటి క్రితమే U.N.S.C అత్యవసర సమావేశంలో రష్యా చర్యలపై మండలిలో ఓటింగ్ నిర్వహించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. వీటో పవర్ సాయంతో తీర్మానాన్ని రద్దు చేయించుకుంది.

అంతకుముందు ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో భారత్ తమకు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అందుకు దారితీసిన కారణాలను అర్థం చేసుకున్నందుకు భారత్‌కు అభినందనలు తెలిపింది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకోనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌ తమకు మద్దతు ఇచ్చే అంశంపై రష్యా ఈ విధంగా స్పందించింది. అటు మొదటి నుంచి రష్యాకు మద్దతు తెలుపుతూ వస్తోన్న చైనా కూడా.. ఓటింగ్ కు దూరంగా ఉంది.

యుక్రెయిన్‌-రష్యా మధ్య రెండోరోజు యుద్ధం మరింత భీకరంగా సాగింది. రష్యా ముప్పేట దాడులతో విరుచుకుపడింది. పలు నగరాలు, సైనిక స్థావరాలపై మూడు వైపుల నుంచి పదాతిదళాలు, యుద్ధట్యాంకులతో అటాక్ చేసింది. రాజధాని కీవ్‌, రెండో పెద్దనగరం ఖర్కివ్‌తో పాటు పలు పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలతో యుక్రెయిన్ బలగాలు ఉద్ధృతంగా పోరు సాగించాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి ప్రవేశించిన పుతిన్‌ సేనలు.. కీలక, వ్యూహాత్మక ప్రాంతాల వైపు కదులుతున్నాయి. వారిని నిలువరించేందుకు ప్రజలకు ఆయుధాలిచ్చిన యుక్రెయిన్‌ సైన్యం… రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.

కీవ్‌, ఖర్కీవ్‌, ఒడెస్సా, మారియాపోల్‌ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్‌ నదికి అనుసంధానించే ఖెర్సాన్‌ ప్రాంతంపైనా దాడులు చేస్తున్నాయి రష్యా బలగాలు. యుక్రెయిన్‌ ఆర్థిక కార్యకలాపాలను కట్టడి చేసేలా… కీలకమైన ఒడెస్సా పోర్టుపైనా పట్టు బిగించాయి. మాస్కో బలగాలు రెండో రోజు తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నగరం నడిబొడ్డుకు చేరుకోవటంతోపాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కివ్‌లోకి ప్రవేశించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com