తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'తెలుగు తల్లికి పద్యాభిషేకం'

- February 28, 2022 , by Maagulf
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో \'తెలుగు తల్లికి పద్యాభిషేకం\'

అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” లో భాగంగా ఫిబ్రవరి 27 న, 33 వ అంతర్జాల దృశ్య సమావేశం – “తెలుగు తల్లికి పద్యాభిషేకం” అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా జరిగింది. 

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి సమావేశాన్ని ప్రారంభించి, తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యానికున్నదని, పద్యం రాయగల్గడం ఒక ప్రత్యేక కళ అని, ఈ నాటి కార్యక్రమంలో ఇంతమంది లబ్దప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషం అంటూ  అతిథులందరకూ ఆహ్వానం పలికారు.    

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఏ ఇతర భాషలకూ లేని పద్యం, అవధానం లాంటి సౌందర్యం, సొగసులు మన తెలుగు భాషకున్నాయని, ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ,పర్వ్యాప్తి కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తున్నదని తెలియజేశారు.      
ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా ఉన్న డా.వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్రను డా.ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేస్తూ – సాధారణంగా రాజులు సంగీత, సాహిత్య, నృత్యాంశాలను అభిమానిస్తూ, ఆదరిస్తుంటారు.కాని వేంకటగిరి సంస్థానంలో వెలుగోటి రాజవంశం లో జన్మించిన డా.సాయి కృష్ణ యాచేంద్ర స్వతహాగా సంగీత సాహిత్య ప్రతిభామూర్తి గావడం,మద్రాసు విశ్వవిద్యాలయంనుండి తెలుగు సాహిత్యంలో పి.హెచ్ డి పట్టా పొందడం విశేషం అన్నారు. 
డా. సాయి కృష్ణ యాచేంద్ర తన కీలకోపన్యాసం లో సాహిత్యలోకంలో అంతగా ప్రచారంలో లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ కలం నుండి “భాగవతం”, “వేంకటాచల మహత్యం”, “రమా పరిణయం”, “యక్షగాన కృతులు”, “శివ నాటకం” లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయని, 12 స్కందాల భాగవతంలో 7, 8, 9, స్కందాలు అలభ్యంగా ఉన్నాయని, వాటి కోసం శోధించవలసిన అవసరం ఉందన్నారు. బాల వితంతువైన వెంగమాంబ ఎక్కువ కాలం ధ్యాన యోగంలో గడిపేవారని, ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల తాను నిరాదరణకు గురైనా వాటినన్నింటినీ తట్టుకుంటూ ఎదురు నిల్చి పోరాడిన ఆమె జీవితం “నారీ జనాభ్యుదయానికి నాందీ గీతంగా” నిలుస్తుందని అన్నారు. 

అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, నటుడు, గాయకుడు, ప్రయోక్త డా. అక్కిరాజు సుందర రామకృష్ణ; ప్రముఖ రచయిత, నటుడు, సంగీత నవావధాని, “కళారత్న” డా.మీగడ రామలింగస్వామి; “పరవస్తు పద్యపీఠం” మరియు “తెలుగుదండు” వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయనసూరి; పనిచేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికి, పూర్తి కాలం తెలుగు భాషా సాహిత్య వికాసాలకు అంకితమై “పద్యపరిమళం” యుట్యూబ్ ఛానల్ ద్వారా పద్యాభిషేకం చేస్తున్న పాతూరి కొండల్ రెడ్డి; ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రంలో డైరెక్టర్ గా సుదీర్ఘకాలం పని చేసిన ప్రముఖ సినీ, జానపద, శాస్త్రీయ గాయకులు చంద్ర తేజ; కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒక భాద్యతాయుతమైన పదవిలో పనిచేసిన, ఆకాశవాణి లో లలిత సంగీతంలో ఉత్తమ శ్రేణి కళాకారుడుగా గుర్తింపు పొందిన మధుర గాయకులు తాతా బాలకామేశ్వర రావు లు సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితలు సృస్టించిన సాహిత్యం నుండి, చలనచిత్రాలనుండి అనేక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి, తమ గాన మాధుర్యంతో తెలుగు తల్లికి పద్యాభిషేకం చేసి అందర్నీ పరవశింపజేశారు.  

పాల్గొన్న ముఖ్య అతిథి,అతిథులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలియజేస్తూ “ప్రపంచ రంగస్థల దినోత్సవం” సందర్భంగా మర్చి 27 న “పౌరాణిక నాటక వైభవం” అనే 34 వ సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశంగా జరుగుతుందని ప్రకటించారు. 
“తెలుగు తల్లికి పద్యాభిషేకం” పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించ వచ్చును. 
https://www.youtube.com/watch?v=j0bd1WLCGSk

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com