ఉన్నత విద్యారంగంలో గణనీయమైన వృద్దిని నమోదు చేస్తున్న ఆంధ్రప్రదేశ్: గవర్నర్
- March 09, 2022
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ గణనీయమైన వృద్దిని నమోదు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ బుధవారం శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి బుధవారం ఆన్ లైన్ విధానంలో ప్రసంగించిన గవర్నర్ కోవిడ్ కారణంగా తరగతి గది అభ్యాసం నుండి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ టెక్నాలజీలను ప్రత్యామ్నాయ వ్యవస్థగా స్వీకరించవలసిన పరిస్ధితి తలెత్తిందన్నారు. సమాజంలోని అన్ని రంగాలపై కోవిడ్ మహమ్మారి ప్రభావం చూపిందన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యా వ్యవస్ధలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని బోధనా విధానంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో మార్పును స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు.
సమగ్ర అభ్యాస ప్రక్రియ, అందరికీ సమానమైన, సమ్మిళిత విద్య జాతీయ విద్యా విధానంలో అంతర్బాగమై ఉన్నాయని గవర్నర్ వివరించారు. నూతన విధానం దేశంలో విద్యా వ్యవస్ధ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందని, 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని యాభై శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా కలిగి ఉందని కులపతి పేర్కొన్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అంబేద్కర్ విశ్వవిద్యలయానికి 12బీ హోదా కల్పించడం హర్షణీయమని, మరోవైపు దేశంలోని పరిశుభ్రమైన ఉన్నత విద్యాసంస్థల్లో ఈ సంస్ధ నాలుగో స్థానంలో నిలవడం అభినంద నీయమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూ షిప్పింగ్ హార్బర్ వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు రానున్నాయని, వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యత కలిగిన వారు అందుబాటులో ఉండేలా శిక్షణ ఇచ్చేందుకు కొత్త కోర్సులు రూపొందించాలన్నారు.
స్నాతకోత్సవం నేపధ్యంలో బంగారు పతకాలు పొందిన వారిని, డాక్టరేట్ సాధించిన వారిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి అచార్య ఎన్.వెంకటరావు స్వాగత ఉపన్యాసం చేసి విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను సమర్పించారు. విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా పాల్గొనగా, అచార్య టి.కామరాజు, డాక్టర్ టి.భవాని విశ్వవిద్యాలయం తరపున కులపతికి జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







