చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలి:ఉపరాష్ట్రపతి
- March 10, 2022
ఐజ్వాల్: పార్లమెంటు, శాసనసభలతోపాటు అన్ని చట్టసభలు తరచుగా సమావేశమవుతూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధంగా నిర్మాణాత్మకమైన బాటలు వేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దీనికితోడు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచడం, ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై విస్తృతమైన చర్చలు జరపడం తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారాయన.
గురువారం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలను సరైన సమయంలో నిర్వహిస్తూ, సరైన అంశాలపై చర్చోపచర్చలు నిర్వహించాలన్నారు. ప్రతి సమావేశం తర్వాత నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలన్నారు.
దేశ స్వాతంత్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే.. ఈ సందర్భంగా మన ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని మరింత బాద్యతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహాసంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. నవభారత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచించాలన్నారు. ఈ దిశగా పునరంకితం కావాలన్నారు.
చట్టసభల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ తక్కువగా ఉందన్నారు. ఈ సంఖ్యను పెంచడం ద్వారా నిర్మాణాత్మక నిర్ణయాలను తీసుకునే విషయంలో వారినీ భాగస్వాములు చేయాల్సిన తక్షణావసరం ఉందన్నారు.
మిజోరం అసెంబ్లీ 50వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో మిజోరం అసెంబ్లీ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ప్రత్యేక సందర్భమన్నారు. ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థలకు మిజోరం రాచబాట వేస్తుందని ఆయన అన్నారు.
శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడంలో ఐదు దశాబ్దాలుగా మిజోరం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. మిజోరం శాంతి ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ అన్నారు. శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు జరుగుతున్న పురోగతిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల్లోనూ విశిష్టమైన కృషి జరుగుతోందన్నారు. ఇదే అంకితభావాన్ని ఇకపైనా కొనసాగించాలని శాసనసభకు ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి జోరంతుంగ, స్పీకర్ లార్లిన్ లియానా సైలో,ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







