హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

- March 11, 2022 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు

హైదరాబాద్: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డును సాధించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (MPPA) విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’గా ఎంపికైంది. ASQ సర్వే ద్వారా ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయ ప్రయాణీకుల సేవలు, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని, అందించే సర్వీసులను పరిశీలిస్తారు. 

GHIAL సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “ACI నిర్వహించే వార్షిక ASQ సర్వేలో ప్రతి ఏడాదీ ప్రయాణీకులు మమ్మల్ని ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నుకోవడం మాకు దక్కిన గౌరవం. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మేం ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో అనేక కస్టమర్ ఫ్రెండ్లీ కార్యక్రమాలను చేపట్టి, విమాన ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి కృషి చేసాం. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన మా భాగస్వాములందరికీ మా కృతజ్ఞతలు. మా కార్యక్రమాలన్నిటిలోనూ అంతర్గతంగా ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ అనే మా లక్ష్యం కనిపిస్తుంది” అన్నారు.

ACI వరల్డ్ డైరెక్టర్ జనరల్ లూయిస్ ఫెలిప్ డి ఒలివెరా, “జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అవార్డు దక్కడం ప్రయాణికులకు మెరుగైన అనుభవం ఇవ్వడానికి వారు చేస్తున్న కృషికి నిదర్శనం. నేటి పరిస్థితులలో విమానాశ్రయాలన్నీ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనం.” అన్నారు.

హైదరాబాద్ విమానాశ్రయం క్రమం తప్పకుండా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) - ఎయిర్‌పోర్ట్స్ సర్వీస్ క్వాలిటీ (ASQ) ప్యాసింజర్ సర్వేలో వరుసగా 9 సంవత్సరాలు (2009 నుండి 2017 వరకు) గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాలలో ఒకటిగా నిలిచింది. 5 - 15 MPPA విభాగంలో 2009, 2010, 2016 & 2017 లో ప్రపంచ నంబర్ 1 స్థానం; 15-25 MPPA విభాగంలో 2018లో ప్రపంచ నంబర్ 4వ స్థానంలో నిలిచింది. 2019, 2020లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 ఎంపిపిఎ విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్' అవార్డులను గెలుచుకుంది. COVID-19 మహమ్మారి సమయంలో ప్రయాణీకుల అభిప్రాయాలను సేకరించి, వారి అవసరాలను అర్థం చేసుకుని దానికి అనుగుణమైన చర్యలు తీసుకున్న నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఇటీవలే హైదరాబాద్ విమానాశ్రయం, ACI ద్వారా “వాయిస్ ఆఫ్ కస్టమర్” గుర్తింపు కూడా పొందింది. 

ప్రపంచ విమానాశ్రయాల వాణిజ్య సంఘం అయిన ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) 1991లో స్థాపించబడింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్, ది సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సహా సభ్య విమానాశ్రయాలు, ప్రపంచ విమానయాన రంగంలోని ఇతర భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. విధాన అభివృద్ధి ముఖ్య దశలలో విమానాశ్రయాల ప్రయోజనాలను కాపాడి, పర్యావరణపరంగా ప్రపంచ వాయు రవాణా వ్యవస్థను సుస్థిరంగా మార్చడానికి ACI కృషి చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com