భారత్ కు వెళ్లే విమానాలలో కోవిడ్ ఆంక్షలు తొలగింపు

- March 22, 2022 , by Maagulf
భారత్ కు వెళ్లే విమానాలలో కోవిడ్ ఆంక్షలు తొలగింపు

న్యూ ఢిల్లీ: వివిధ దేశాల నుంచి భారత్ కు వెళ్లే అంతర్జాతీయ విమానాలలో కోవిడ్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు భారత పౌరవిమానయానశాఖ తెలిపింది. విమానంలో పనిచేసే కేబిన్ క్రూ సిబ్బంది ఇకపై పీపీఈ కిట్ ధరించాల్సిన అవసరం లేదని, అదే విధంగా మహమ్మారి నియంత్రణ నిమిత్తం తీసుకువచ్చిన “మూడు సీట్లు ఖాళీ” నిబంధనను ఎత్తివేస్తున్నట్లు విమానయానశాఖ తెలిపింది. అదేవిధంగా విమాన ప్రయాణికులను భద్రత సిబ్బంది చేతులతో తడుముతూ తనిఖీ చేసే పద్దతిని పునరుద్ధరించింది. పౌరవిమానయానంలో కార్యకలాపాలు సాఫీగా కొనసాగే విధంగా కరోనా ఆంక్షలను సడలించినట్లు భారత పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత్ లో కరోనా మూడో దశ సమయంలో పౌరవిమానయాన రంగం డీలాపడింది.అయితే ప్రస్తుతం దేశంలో మూడో దశ ముగిసి..వ్యాక్సిన్ పంపిణీ చురుకుగా సాగడంతో కరోనా ముంపు పాక్షికంగా తొలగిపోయినట్లు అధికారులు అంచనావేశారు. దీంతో విమానరంగానికి ఊతమిచ్చేలా పౌరవిమానాయన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 2021 నుంచే దేశీయ విమానాల్లో కరోనా ఆంక్షలు సడలించిన కేంద్రం..ఇప్పుడు అంతర్జాతీయ విమానాలలోను ఆంక్షలు సడలించింది. మార్చి 27 నుంచి సడలించిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే అత్యవసర రక్షణ నిమిత్తం విమాన సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను తమతో పాటు వెంట తెచుకోవాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com