సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనదే అంతిమ విజయం:ఉపరాష్ట్రపతి

- March 26, 2022 , by Maagulf
సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనదే అంతిమ విజయం:ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ, సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్లి మెల్లిగా నీరుగారి, తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్న ఆయన, నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా మెల్లి మెల్లిగా తమ ప్రభను కోల్పోతున్నాయని పేర్కొన్నారు. సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ... వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమౌతున్నాయని ఆయన తెలిపారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత  సోమేపల్లి సోమయ్య ,బోగాది దుర్గాప్రసాద్ కు తాను రుణపడి ఉంటానన్న ఉపరాష్ట్రపతి, తాను జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలనని విశ్వసించి, యువకునిగా తనను ప్రోత్సహించి ముందుకు నడిపింది వారేనని తెలిపారు. ఈ ఆవిష్కరణ తనకు వ్యక్తిగతంగా ఓ అవకాశమన్న ఉపరాష్ట్రపతి, ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టి నిర్వాహకులైన నవయుగ భారతి, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలో, కళాశాలలో తనకు ఎంతో మంది గురువులు లభించారన్న ఉపరాష్ట్రపతి, వారు చూపించిన ఆత్మీయత, అందించిన ప్రోత్సాహం మరువలేనివన్నారు. ఇటీవల తమ తెలుగు మాస్టారు అయిన పోలూరు హనుమజ్జానకీ రామశర్మ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా ఓ అవార్డు ఏర్పాటు చేయించి, దాన్ని తెలుగు భాషకు సేవ చేసిన వారికి అందేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆ సందర్భం తనకు ఎంతో సంతృప్తిని అందించిందని తెలిపారు.
 
దేశాన్ని కాపాడుకోవడంతో సమానమైన పుణ్యము గానీ, వ్రతము గానీ,  యజ్ఞము గానీ లేదని  సోమేపల్లి సోమయ్య ఎప్పుడూ చెప్పేవారన్న ఉపరాష్ట్రపతి, దేశ రక్షణ అంటే దేశాన్ని కాపాడుకోవడమని మాత్రమే కాదని, సాటివారి పట్ల మంచిగా వ్యవహరించడం, ధర్మాన్ని, భాషా సంస్కృతులను కాపాడుకోవడం కూడా దేశరక్షణేనని తెలిపారు.సోమయ్య కూడా ఇదే భావనతో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారన్న ఆయన, ఈ పుస్తకం వారి కార్యదీక్ష, నిబద్ధత, చిత్తశుద్ధి, నిరాడంబరత వంటి అనేక అంశాల సమాహారమని, దీని ద్వారా భావితరాలు స్ఫూర్తి  పొందగలవని ఆకాంక్షించారు.
 
సోమేపల్లి సోమయ్య వ్యక్తిత్వం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయనజీవితంలో రాజీ పడలేదని, వ్యక్తిగత కార్యక్రమాల ద్వారా కూడా సమాజానికి ఏదో ఒక ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారని తెలిపారు. ప్రజల సాంఘిక జీవనం ఆందోళనలో పడ్డ ప్రతి సందర్భంలోనూ వారు ముందుకు వచ్చారన్న ఆయన, ప్రకృతి బీభత్సాలు జరిగిన సమయంలో సత్వర సహాయం, శాశ్వత ప్రయోజనం అనే ప్రాతిపదికతో ప్రణాళికలు వేసే వారని తెలిపారు. ఈ తరహా భావజాలం వల్ల సోమయ్య తో పాటు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న తమలాంటి వాళ్ళు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎదుటి వారు చెడు చేసినా సరే, మంచి చేయాలనే ఆలోచనను, సంకల్పాన్ని మాత్రం వదలొద్దు అని శ్రీ సోమయ్య గారు ఉద్బోధించే వారని తెలిపారు. 
 
"నీచుణ్ని జయించాలంటే దానమే మార్గం. అబద్దాలు చెప్పే వాణ్ని సత్యంతోనే జయించాలి. క్రూరుడిని క్షమించే తత్వంతో, ఓర్పుతో లొంగదీయాలి. అలాగే చెడ్డవాణ్ని మంచితనంతోనే జయించాలి." అన్న మహాభారత అరణ్య పర్వంలోని శ్లోకాన్ని ఉదహరించిన ఉపరాష్ట్రపతి, మన మంచితనాన్ని, గొప్పతనాన్ని పరీక్షించేందుకు ఎదుటి వారు ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, వాటిని ఎదుర్కొనే స్థితప్రజ్ఞతను సంపాదించాలనేది సోమయ్య మాటని తెలిపారు.
 
శతాబ్ధాలుగా భారతదేశాన్ని మందుకు నడిపిస్తున్న వసుధైవ కుటుంబ భావనను యువత కాపాడుకోవాలని దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశ అభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది, సమసమాజ స్థాపనకు అవరోధాలుగా నిలుస్తున్న పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, సాంఘిక వివక్షల వంటి దురాచారాలను పారద్రోలేందుకు యువత నడుం బిగించాలని ఆకాంక్షించారు. ఎందరో మహనీయుల జీవితాలను లాభాపేక్ష రహితంగా అతి తక్కువ మూల్యంతో నవయుగ భారతి పుస్తకాలుగా అందుబాటులోకి తెస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య, నవయుగభారతి అధ్యక్షుడు బాలేంద్ర పొట్టూరి, తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, ఈ పుస్తక రచయిత కె. శ్యామ్ ప్రసాద్ తోపాటు ఆర్ఎస్ఎస్ ముఖ్యనాయకులు, స్వయంసేవకులు, నగరానికి వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com