ప్రభుత్వ పథకాలను పేదల వద్దకు సమర్థవంతంగా చేర్చాల్సిన బాధ్యత పాలనాధికారులదే: ఉపరాష్ట్రపతి
- March 29, 2022
న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలను అరికట్టాల్సిన తక్షణావసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ లోపాలను అరికట్టడం ద్వారా ప్రజలకోసం ఉద్దేశించిన పథకాలను సమర్థవంతంగా వారికి అందించాల్సిన బాధ్యత పాలనాధికారులపై ఉందని ఆయన అన్నారు. అప్పుడే సమాజంలోని అన్నివర్గాలకు సమన్యాయం సాధ్యమవుతుందన్నారు.
ఢిల్లీలోని ఐఐపీఏ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన డా. బాబూ రాజేంద్రప్రసాద్ ప్రథమ వార్షిక అంతర్జాతీయ స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి.. ప్రజాకేంద్రిత సుపరిపాలన కొనసాగాలంటే ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం పాలనాధికారులు సమగ్రత, పారదర్శకత, నిజాయితీ, క్రియాశీలత తదితర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేలా ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు.
భారతదేశ అభివృద్ధి పథంలో మన సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. అందరినీ కలుపుకుపోతూ, అందరికోసం పనిచేసే విషయంలో పాలనాధికారుల పాత్ర కీలకమన్న ఆయన, ఐఐపీఏ ద్వారా పాలనాధికారుల సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలకు మరింత పదును పెడుతుండటం అభినందనీయమన్నారు.
ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు పాలనాధికారులు సిద్ధంగా ఉండాలని, భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న అత్యుత్తమ పద్ధతులను అర్థం చేసుకుని మన సమాజంలోని వారికి ఆ పద్ధతుల్లో లబ్ధి చేకూర్చేందుకు పనిచేయాలని సూచించారు.
భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో మన దేశం సాధిస్తున్న ప్రగతిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ‘ఆత్మనిర్భర భారత్’ నినాదంతో సమగ్రాభివృద్ధి దిశగా మన దేశం దూసుకెళ్తున్న విషయాన్ని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. సామాజిక-ఆర్థిక, సాధికార సమాజ నిర్మాణం లక్ష్యంగా జరుగుతున్న ఈ మహత్కార్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది ఓ మహోన్నతమైన వ్యక్తిత్వమని ఉపరాష్ట్రపతి కొనియాడారు. సమృద్ధి, ఐకమత్య, బలమైన భారతదేశ నిర్మాణం కోసం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టి, స్వతంత్ర భారత ప్రథమ రాష్ట్రపతిగా ఎదిగిన వారి జీవితం స్ఫూర్తివంతమైనదన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఛత్తీస్ గడ్ మాజీ గవర్నర్ శేఖర్ దత్, ఐఐపీఏ డీజీ, సభ్యకార్యదర్శి ఎస్ఎన్ త్రిపాఠీ, ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు తోపాటుగా ఐఐపీఏ బోధనా సిబ్బంది, ఉన్నతాధికారులు, నైపుణ్య శిక్షణార్థులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …