ఏపీ: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత

- April 01, 2022 , by Maagulf
ఏపీ: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత

అమరావతి: ప్రయాణికులు వెళ్లాల్సిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కేటుగాళ్లు నోట్ల కట్టలు తరలిస్తున్నారు.సీట్ల పై ప్రయాణికులు.. సీట్ల కింద నోట్ల కట్టలతో ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు నిందితులు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి వద్ద బస్సులో భారీగా నగదు పట్టుబడింది.టోల్‌ ప్లాజా దగ్గర ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు గుర్తించారు పోలీసులు.బస్సు డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ నగదు సుమారు 5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

టోల్‌ప్లాజా వద్ద బస్సును తనిఖీ చేసిన పోలీసులు… బస్సు లగేజ్ డిక్కీలలో, సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సులో ఇంత పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు బస్సులో 5కోట్లు ఎవరివి? ఎవరికి ఇవ్వడానికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యాసింజర్‌ సీట్ల కింద పెట్టి ఈ డబ్బును తరలిస్తుండటంతో ఇది బ్లాక్ మనీగా అనుమానిస్తున్నారు పోలీసులు. డబ్బు తరలింపు విషయం డ్రైవర్‌, క్లీనర్‌కు ముందే తెలుసా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

విజయనగరం నుంచి గుంటూరు వెళుతున్న బస్సులో నగదును ఎప్పుడు ఎక్కడ పెట్టారనే అంశాలపై విచారిస్తున్నారు పోలీసులు. విజయనగరంలోనే బస్సులో ఎక్కించారా.. లేక మార్గమధ్యలో నగదును బస్సులో ఉంచారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

బస్సులో భారీ నగదు తరలించడంపై ట్రావెల్‌ యాజమాన్యంపైనా అనుమానాలు వ్యక్తమవతున్నాయి.ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి నోట్ల కట్టలకు ఏమైనా లింక్ ఉందా? లేక ఐదు కోట్ల అక్రమ రవాణా వెనక ఇంకెవరైనా బడా బాబులున్నారా అనే వివరాలను పోలీసులు కరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com