కళాకారులకు సరైన సమయంలో అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలి: ఉపరాష్ట్రపతి

- April 02, 2022 , by Maagulf
కళాకారులకు సరైన సమయంలో అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలి: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: భారతీయ శిల్పులు, చేతివృత్తి కళాకారులకు సరైన సమయంలో అవసరమైనంతమేర రుణాలు అందించడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించడం ద్వారా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వారి కాళ్లమీద వారే నిలబడే పరిస్థితిని కల్పించాలన్నారు. అప్పుడే వారు గౌరవప్రదమైన జీవితాన్ని జీవించేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
 
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగం నుంచి సామాన్య భారతీయ పౌరుల వరకు ప్రతి ఒక్కరూ మన శిల్పులు, చేతివృత్తి కళాకారుల ఉత్పత్తులకు కొనడం ద్వారా వారిని మరింతగా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని సూచించారు. తద్వారా మన కళలు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
 
మన సాంస్కృతిక సంపదలైన నృత్యం, సంగీతం తదితర కళలు..  ప్రపంచానికి భారతదేశం అందించిన విలువైన కానుకలన్న ఉపరాష్ట్రపతి, ఇవన్నీ కేవలం మనోల్లాసం కోసమే కాదని.. ఇవి మన జీవితాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దగలవని పేర్కొన్నారు. ఇలాంటి విలువైన సంపదను కాపాడుకుంటూ ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
వివిధ రకాలైన భారతీయ కళలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నఉపరాష్ట్రపతి.. విద్యతోపాటు కళల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. పిల్లల్లో నిగూఢంగా ఉన్న శక్తిసామర్థ్యాలను వెలికితీసి వాటికి సరైన గుర్తింపు అందించేందుకు కళలు ఉపయుక్తం అవుతాయన్నారు. సాంకేతికత వినియోగం పెరుగుతుందడటాన్ని సద్వినియోగం చేసుకుంటూ దీని ద్వారా జానపద కళలు, శాస్త్రీయ నృత్యం, సంగీతం, చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 
మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు.  రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం ద్వారా భారతీయ కళలు, చేతివృత్తులకు సరైన గుర్తింపు లభిస్తోందన్నారు. ‘ఈ కార్యక్రమం మన వైభవోపేతమైన సంస్కృతి, సంప్రదాయాలు, చక్కటి కళారూపాల ప్రదర్శనకు మంచి వేదిక’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
 
12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని హైదరాబాద్, రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో 35 జానపద బృందాలకు చెందిన 550 మంది జానపద కళాకారులు, 150కి పైగా చేతివృత్తి కళాకారులు భాగస్వాములయ్యారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన దాదాపు 150 మంది నృత్య కళాకారులు తమ కళలను ప్రదర్శించారు.కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా 400 మంది జానపద కళాకారుల పద్రర్శనను ఉపరాష్ట్రపతి తిలకించారు.
ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com