ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏపీ గవర్నర్

- April 07, 2022 , by Maagulf
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఏపీ గవర్నర్

విజయవాడ: ఆంధ్రా హాస్పటల్స్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్
చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్న తీరు అభినందనీయం.వైద్యులు పేదల పట్ల సానుభూతితో ఉండాలని, వైద్యం కోసం ఆసుపత్రులకు దాకా రాలేని అణగారిన వర్గాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. నివారించదగినప్పటికీ పర్యావరణ ప్రతికూలతల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు  మరణాలు సంభవించటం ఆందోళనకరన్నారు.వాతావరణ సంక్షోభం కూడా ఆరోగ్య సంక్షోభమేనని ఇది మానవాళి ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ముప్పు అని గవర్నర్ పేర్కొన్నారు. ఆంధ్రా హాస్పిటల్‌లో గురువారం జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా 2000 మందికి పైగా చిన్నారులకు ఆంధ్రా హాస్పటల్ ఉచితంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించటం ముదావహమన్నారు.

ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ వారంలో మరో 35 సర్జరీలు చేయడానికి ప్రణాళికలు రూపొందించటం అభినందనీయమన్నారు. కరోనా మనకు వైద్య శాస్త్రం యొక్క శక్తిని చూపించినప్పటికీ,  ప్రపంచంలోని అసమానతలను, సమాజంలోని బలహీనతలను ఇది బహిర్గతం చేసిందని, ఫలితంగా సమాజ శ్రేయస్సు కోసం సుస్ధిర చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం ప్రస్పుటం అయ్యిందన్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తోందని, ఆందోళన కలిగించే నిర్దిష్ట ఆరోగ్య అంశంపై ప్రపంచం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం ఇదే రోజు స్ధాపించారని గుర్తు చేసారు.

కరోనా మహమ్మారి సమయంలో నిబద్ధతతో కూడిన వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 10,000 మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతుండగా, వారిలో మూడవ వంతు మంది తగిన వైద్య సదుపాయం అందక తమ తొలి జన్మదినాన్ని జరుపుకోలేకపోతుండటం ఆందోళణ కలిగిస్తుందన్నారు.  వైద్య సహాయం అందుబాటులో ఉంటే, ఈ చిన్నారులు ఉజ్వల భవిష్యత్తుతో మంచి జీవితాన్ని గడపగలుగుతారని గవర్నర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా హాస్పిటల్స్ లో విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడిన గవర్నర్ వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఆంధ్రా హాస్పటల్ ఎండి, ఛీప్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ పివి రమణ మూర్తి, సంస్ధ డైరెక్టర్, చిన్నారుల సేవల విభాగం అధిపతి డాక్టర్ పివి రామారావు, డాక్టర్ దిలీప్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ విక్రమ్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com