చైనాలో కరోనా విజృంభణ..

- April 16, 2022 , by Maagulf
చైనాలో కరోనా విజృంభణ..

బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న వేళ చైనాలో మాత్రం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయపెడుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కరోనా విజృంభణ కారణంగా షాంఘైతోపాటు పలు నగరాలు పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో 40 కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో చిక్కుకున్నారు. రెండు నెలల క్రితం తొలిసారి షెంఝేన్‌ నగరంలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాతి నుంచి పలు నగరాలు క్రమంగా ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి.

ప్రస్తుతం 100 ప్రధాన నగరాల్లోని 87 చోట్ల కొవిడ్ ఆంక్షలు అమలవుతున్నాయి.కున్‌షాన్ నగరంలో గత వారం ఆంక్షలు విధించడంతో తైవాన్ టెక్ కంపెనీలు మూతపడ్డాయి. షాన్‌షీ ప్రావిన్స్ రాజధాని తైయువాన్‌లోనూ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.ప్రావిన్సులోని ఆరు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు.వాణిజ్య నగరమైన గువాన్‌ఝౌలో పాఠశాలలను మూసేశారు. నిన్నమొన్నటి వరకు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న జిలిన్ ప్రావిన్స్‌తోపాటు సుజౌ, టాంగ్‌షాన్ వంటి ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి కొంత అదుపులోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

ఐఫోన్లు తయారుచేసే పెగాట్రాన్ కార్పొరేషన్‌తోపాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు కూడా మూతపడ్డాయి. లాక్‌డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొవిడ్ జీరో విధానానికే కట్టుబడి ఉంటుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తేల్చి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com