WHO చీఫ్ టెడ్రోస్ పేరును మార్చేసిన మోదీ: గుజరాత్ పర్యటనలో పరిణామం

- April 20, 2022 , by Maagulf
WHO చీఫ్ టెడ్రోస్ పేరును మార్చేసిన మోదీ: గుజరాత్ పర్యటనలో పరిణామం

ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ పేరును ఈరోజు నుంచి “తులసీభాయ్”గా మార్చేస్తున్నట్లు ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే భారత ప్రధాని నరేంద్ర మోదీ..గత మూడు రోజులుగా తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రామాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈ పర్యటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్, డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ కూడా పాలుపంచుకున్నారు. ఈక్రమంలో బుధవారం గాంధీనగర్లో జరిగిన “గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను” టెడ్రోస్ తో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, టెడ్రోస్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

“నేను గుజరాత్ వచ్చాను, నాకోసం గుజరాతీ పేరు ఏదైనా ఆలోచించారా?” అంటూ ట్రెడోస్ సరదాగా వ్యాఖ్యానించగా.. అందుకు ప్రధాని మోదీ స్పందించారు. “మిమ్మల్ని తులసీభాయ్ అని పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని మోదీ అన్నారు. తరతరాలుగా భారతీయులు తులసి మొక్కను పూజించారని ప్రధాని మోదీ వివరించారు. “WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ నాకు మంచి స్నేహితుడు. భారతీయ ఉపాధ్యాయులు తనకు పాఠాలు నేర్పించారని, వారి కారణంగా తాను ఈస్థాయిలో ఉన్నానని అతను ఎప్పుడూ నాతో చెప్పాడు. ‘నేను పక్కా గుజరాతీని అయ్యాను. మీరు నాకు పేరు నిర్ణయించారా? అని నన్ను టెడ్రోస్ అడిగారు’ కాబట్టి నేను ఆయనకు తులసీభాయ్ గా నామకరణం చేస్తున్నా. తులసి అనేది ఆధునిక తరాలు మర్చిపోతున్న సంజీవనీ మొక్క. తరతరాలుగా భారతీయులు తులసిని పూజించారు. మీరు వివాహంలో కూడా తులసి మొక్కను ఉపయోగించవచ్చు.” అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్‌తో పాటు మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్ కూడా హాజరయ్యారు. సాంప్రదాయ వైద్యం కోసం భారత దేశానికి రావాలనుకునే విదేశీ పౌరుల కోసం త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. “ఆయుష్ థెరపీని సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశానికి రావాలనుకునే విదేశీ పౌరుల కోసం త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని పరిచయం చేయనున్నాం” అని ప్రధాని మోదీ చెప్పారు.

ఆయుష్‌ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణల అవకాశాలు అపరిమితంగా ఉన్నాయని ఆయన అన్నారు. “ఆయుష్ ఔషధాలు, ప్రత్యామ్న్యాయాలు మరియు సౌందర్య సాధనాల ఉత్పత్తిలో అపూర్వమైన వినియోగాన్ని ఇప్పటికే చూస్తున్నాము” అని మోదీ తెలిపారు. “ఆయుష్ ఉత్పత్తుల కోసం ఒక ప్రత్యేక హాల్‌మార్క్‌ను తీసుకురానున్నామని ఈ హాల్‌మార్క్ భారతదేశంలో తయారు చేయబడిన అత్యంత నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు వర్తించబడుతుందని మోదీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com