పన్నుల వ్యవస్థను మరింత సరళీకరించాల్సిన అవసరముంది: ఉపరాష్ట్రపతి

- April 29, 2022 , by Maagulf
పన్నుల వ్యవస్థను మరింత సరళీకరించాల్సిన అవసరముంది: ఉపరాష్ట్రపతి
నాగ్‌పూర్: పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా పన్ను చెల్లించేందుకు వారిని ప్రోత్సహించడంతోపాటు, ఈ అంశాల్లో ముడిపడి ఉన్న సమస్యలను తొలగించేలా పన్నుల వ్యవస్థను మరింత సరళీకరించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, సుస్థిర, వినియోగదారులకు అనుకూలమైన, పారదర్శరమైన పన్నుల వ్యవస్థ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. 
శుక్రవారం నాగ్‌పూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్  టాక్సెస్ (ఎన్ఏడీటీ)లో ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) 74వ బ్యాచ్ శిక్షణ ముగింపు ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నుల విధానంలో పారదర్శకత, పన్ను చెల్లింపుదారులకు అనువైన వాతావరణ నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశ ఆర్థిక సమగ్రతకు డిజిటల్ సాంకేతికత చాలా కీలకమన్న ఉపరాష్ట్రపతి ఉత్తమ సేవలు అందించడం, లీకేజీలను అరికట్టడం ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలను చేపట్టేందుకు వీలవుతుందన్నారు.
 
ప్రజల జీవితాల్లో సానుకూలమైన మార్పును తీసుకొచ్చేందుకు, వ్యవస్థ పనితీరును అనుకూలంగా మార్చేందుకు అవసరమైన ఉన్నతమైన ప్రమాణాలను సివిల్ సర్వెంట్లు నెలకొల్పాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘స్వరాజ్యాన్ని సురాజ్యంలోని, సుపరిపాలనలోకి మార్చడమే లక్యంగా మనం పనిచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ పన్ను వసూళ్లలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ పోషిస్తున్న పాత్రను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, పన్ను చెల్లింపుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పన్ను చెల్లింపుదారుల పట్ల మహాభారతంలో పేర్కొన్న అంశాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ‘పుష్పాలనుంచి తేనెటీగలు మధురమైన తేనెను సేకరించే సమయంలో పుష్పానికి ఎలాంటి హానీ కల్పించనట్లుగానే పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా పన్నులు సేకరించాలి’ అని సూచించారు.
 
ప్రభావవంతమైన పన్నుల వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన, పన్ను వసూళ్లను పెంచడంతోపాటు ఈ విధానం పారదర్శకంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. పన్ను చెల్లింపుదారులు తమ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వృద్ధి చెందుతుంటే పన్ను వసూళ్లు పెరుగుతుదాయని తద్వారా దేశ జీడీపీ, ఆదాయం పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 
 
కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పన్నుల సంస్కరణల ద్వారా సానుకూల మార్పు కనబడుతోందని, సమస్యలను పరిష్కరించడం, పదే పదే అప్పీళ్లకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం వంటి వాటి ద్వారా పన్నుచెల్లింపుదారులకు మేలు జరుగుతోందన్నారు. అధికారులు, పన్నుచెల్లింపుదారుల మధ్య నిరంతర సమన్వం ద్వారా పారదర్శకత, పరస్పర గౌరవం పెరుగుతాయన్నారు.
 
భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సమయంలో.. ఇన్నేళ్లుగా సివిల్ సర్వీసెస్ అధికారులు దేశ ప్రగతికి చేసిన సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.  ఐఆర్ఎస్ శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత సానుకూల వాతావరణాన్ని నిర్మించేదిశగా పనిచేయాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, మహారాష్ట్ర మంత్రి డాక్టర్ నితిన్ రౌత్, సీబీడీటీ చైర్మన్ జేబీ మొహాపాత్ర, ఎన్ఏడీటీ ప్రిన్సిపల్ డీజీ ప్రవీణ్ కుమార్, ఏడీజీ బి. వెంకటేశ్వరరావు సహా శిక్షణార్థులు, ఐఆర్ఎస్ అధికారులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com