భారత హీరో ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖీకి పులిట్జర్‌

- May 10, 2022 , by Maagulf
భారత హీరో ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖీకి పులిట్జర్‌

న్యూయార్క్‌: ఏడాది క్రితం అఫ్గానిస్థాన్‌ ఘర్షణల సమయంలో తాలిబన్‌ కాల్పుల్లో దుర్మరణం చెందిన భారత ఫొటోగ్రాఫర్‌ దానిశ్‌ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. భారత్‌లో కరోనా మరణాలపై ఆయన తీసిన చిత్రాలకు గానూ పులిట్జర్‌ అవార్డు ప్రకటించారు.

2022 సంవత్సరానికి గానూ పులిట్జర్‌ ప్రైజ్‌ విజేతలను సోమవారం ప్రకటించారు. ఇందులో ఫీచర్‌ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్‌ సంస్థకు చెందిన దానిశ్ సిద్దిఖీ, అద్నన్‌ అబిదీ, సన్నా ఇర్షాద్‌, అమిత్ దవేను విజేతలుగా ప్రకటించారు. భారత్‌లో కొవిడ్‌ మరణాలపై వీరు తీసిన చిత్రాలకు గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కమిటీ వెల్లడించింది.

కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతి సమయంలో దిల్లీ సహా పలు ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దిల్లీలో ఒకేసారి అనేక మంది మరణించడంతో పలు శ్మశాన వాటికల్లో సామూహిక అంత్యక్రియలు చేపట్టారు. అందుకు సంబంధించి సిద్దీఖీ తీసిన ఫొటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. కొవిడ్‌ ఉద్ధృతి సయమంలో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు భారత్‌లో మహమ్మారి పరిస్థితులను అద్దం పట్టడమే గాక.. ఎంతోమంది హృదయాలను కదలించాయి. కాగా.. సిద్దీఖీ పులిట్జర్‌ పురస్కారం గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2018లో మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థుల ఫొటోకు తొలి పులిట్జర్‌ అందుకున్నారు. 

మయన్మార్‌ సైన్యం దాడులు భరించలేక రోహింగ్యా శరణార్థులు బోట్లలో బంగ్లాదేశ్‌లోకి తరలి వచ్చిన సమయంలో ఓ మహిళ.. అక్కడి నేలను చేతితో తాకుతున్నప్పుడు తీసిన చిత్రమిది. అంతర్జాతీయ సమాజాన్ని కదిలించిన ఈ చిత్రానికే సిద్దీఖీకి పులిట్జర్‌ అవార్డు దక్కింది.

ఎకానమిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసిన సిద్దీఖీ తొలుత పలు టీవీ ఛానళ్లలో కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2010లో రాయిటర్స్‌ సంస్థలో ఫొటో జర్నలిస్టుగా చేరారు. ఆ సంస్థ తరఫున దేశ, విదేశాల్లో అనేక సంచలన వార్తలను కవర్ చేశారు. హాంకాంగ్ అల్లర్లు, రోహింగ్యా ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు తీశారు. గతేడాది అఫ్గాన్‌లో అమెరికా, నాటో సేనల ఉపసంహరణ నేపథ్యంలో ప్రభుత్వ దళాలు, తాలిబన్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును కవర్‌ చేసేందుకు వెళ్లిన ఆయన విధి నిర్వహణలోనే తుదిశ్వాస విడవడం విషాదకరం.

ఆఖరి ఫొటో.. చివరి విశ్రాంతి
అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో గల స్పిన్‌ బోల్డక్‌ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు, అఫ్గాన్‌ బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వార్తను కవర్‌ చేసేందుకు సిద్దీఖీ.. అఫ్గాన్‌ దళాలతో కలిసి అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయన తీసిన ఆఖరి ఫొటో ఇదే. ఈ ఘర్షణలను కవర్‌ చేసే సమయంలో 15 గంటల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఆయన మధ్యలో 15 నిమిషాలు పాటు విరామం దొరకడంతో పచ్చికపైనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఫొటోను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అదే ఆయన చివరి విశ్రాంతి అయ్యింది. తర్వాత జరిగిన కాల్పుల్లో సిద్దీఖీ మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com