హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రవాసి సహాయతా కేంద్రం’ ప్రారంభం

- May 11, 2022 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రవాసి సహాయతా కేంద్రం’ ప్రారంభం

* సహాయతా కేంద్రంలో 24 గంటల పాటు అందుబాటులో TOMCOM సిబ్బంది
* మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి 
 

హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) భాగస్వామ్యంతో విదేశాలకు, ముఖ్యంగా కువైట్, ఖతార్‌లకు ప్రయాణించే వలస కార్మికుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రవాసి సహాయతా కేంద్రం ఈ రోజు ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ప్రవాసి సహాయతా కేంద్రాన్ని ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ కేంద్రం సురక్షితమైన, చట్టబద్ధమైన ప్రవాసం గురించి అవగాహన పెంచడానికి, గృహ కార్మికులు, నిర్మాణరంగ కార్మికులు వంటి వారికి సరైన పత్రాలు,ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం అవసరమైన పత్రాల విషయంలో సహాయపడుతుంది. అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్ వద్ద అందుబాటులో ఉండే ఈ సహాయతా కేంద్రం 24 గంటలూ పని చేస్తుంది.

దీనిపై ప్రదీప్ పణికర్, CEO-GHIAL మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుండి మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాలకు ప్రయాణించే వలస కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామందికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్, ఇతర డాక్యుమెంటేషన్ గురించి పెద్దగా తెలీదు. ప్రయాణికుల పత్రాలను పరిశీలించడం, అవగాహన కల్పించడం మరియు ఎమిగ్రేషన్ క్లియరెన్స్‌లో ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంలో ప్రవాసి సహాయతా కేంద్రం  సహాయపడుతుంది. ఇలాంటి గొప్ప ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు నేను తెలంగాణ ప్రభుత్వానికి, రాణి కుముదిని కి, TOMCOM బృందానికి ధన్యవాదాలు చెబుతున్నాను.’’ అన్నారు.

ప్రతి సంవత్సరం వేలాది మంది బ్లూ కాలర్ కార్మికులు ఉపాధి కోసం తెలంగాణ నుండి మధ్య-ప్రాచ్య దేశాలకు వెళుతున్నారు. కొన్నిసార్లు వారు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్న తెలంగాణ యువత అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM)ని ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com