తెలంగాణ కు రానున్న ఇంగ్లాండ్ లాబొరేటరీ..కేటీఆర్ పర్యటనే కారణం
- May 18, 2022
*లాబొరేటరీని ఏర్పాటు చేయనున్న ఇంగ్లాండ్ కు చెందిన సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్
*యూకె లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ సమావేశానంతరం ప్రకటించిన సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్
లండన్: తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఇంగ్లాండ్ కు చెందిన సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఏర్పాటుచేయబోతుంది. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే ఈ ల్యాబ్ లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్ పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్ ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ ప్రకటించింది.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, గ్లోబల్ ఛానల్ మేనేజ్మెంట్ & ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ డానియల్ విల్లాలోబోస్, లండన్ లోని ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ కుతుబుద్దీన్ లు సమావేశం అయ్యారు. తమ కంపెనీ ప్రణాళికలు, పరిశోధనలను కేటీఆర్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్లో తమ అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఏర్పాటుచేయడానికి కారణమని సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ చెప్పారు. తమలాంటి కంపెనీల పెట్టుబడులకు ఇండియా ఆకర్షణీయ గమ్యస్థానమన్నారు.పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ (హైదరాబాద్) భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ ల్యాబ్ తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. తమ కంపెనీకి యునైటెడ్ కింగ్డమ్ తో పాటు జర్మనీ, అమెరికా, చైనా, ఇండియాలో యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అపార నైపుణ్యం కల శాస్త్రవేత్తలు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలు ఉన్న నగరంలో తమ ల్యాబ్ ను ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ లో ల్యాబ్ ను ఏర్పాటుచేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్ కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనం అన్నారు. ఫార్మా లో దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్ కు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







