హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు

- May 25, 2022 , by Maagulf
హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇకపై ఆర్టీసీ సిటీ బస్సుల సర్వీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నాయి.సాధారణంగా అర్దరాత్రి 12 గంటలకు చాలా మార్గాల్లో సిటీ సర్వీసులు నిలిచిపోతాయి.ఆ సమయం తర్వాత ప్రయాణం చేయాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే.ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా సిటీ బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది.అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఆ తర్వాత ఎలాగూ రెగ్యులర్ బస్సులు డిపోల నుంచి బయలుదేరుతాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఆర్టీసీ సిటీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లయింది.

ఇప్పటికే పలు మార్గాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆర్టీసీ సిటీ బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు.ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. క్రమంగా మరిన్ని మార్గాల్లోనూ నైట్ బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 

ఆర్టీసీ నైట్ బస్ సర్వీసుల్లోనూ అన్ని రకాల పాసులను అనుమతిస్తారు. ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్లను కూడా అనుమతిస్తారు. ఈ సర్వీసుల పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అభద్రతకు గురిచేస్తుందని... ఆర్టీసీ బస్సుల్లో అయితే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

నైట్ బస్ సర్వీసుల వివరాలు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో తెలిసిందే. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. వీటిల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము సమయంలో స్టేషన్‌కు చేరే... లేదా ఆ సమయంలో స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు చాలానే ఉన్నాయి. 

ఆ సమయంలో స్టేషన్‌కు చేరుకోవాలనుకునే ప్రయాణికులకు లేదా స్టేషన్ నుంచి నగరంలో తాము ఉండే ప్రాంతాలకు చేరుకోవాలనుకునేవారికి ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని... ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు నైట్ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హయత్ నగర్, పటాన్ చెరు, బోరబండ, మెహదీపట్నం, అఫ్జల్ గంజ్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలకు నైట్ సర్వీసులు నడుపుతున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి కూడా పలు ప్రాంతాలకు ఆర్టీసీ నైట్ బస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com