సెనెగల్ అభివృద్ధిలో భారతదేశం విశ్వసనీయమైన భాగస్వామి: ఉపరాష్ట్రపతి

- June 03, 2022 , by Maagulf
సెనెగల్ అభివృద్ధిలో భారతదేశం విశ్వసనీయమైన భాగస్వామి: ఉపరాష్ట్రపతి

డకార్: మూడు దేశాల పర్యటనలో భాగంగా సెనెగల్ రాజధాని డకార్ కు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నేతృత్వంలోని భారత బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి ఐసాటా తాల్ సాల్ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి సారిగా ఉన్నతస్థాయి భారతబృందం సెనెగల్ లో పర్యటించింది.

డకార్ లో సెనెగల్ అధ్యక్షుడు మెకీ సాల్ తో ఉపరాష్ట్రపతి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సెనెగల్ సర్వతోముఖాభివృద్ధిలో భారతదేశం మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, యువత సంబంధిత అంశాల్లో సహకారం, దౌత్యవేత్తలు, అధికారులకు వీసా-ఫ్రీ రిజైమ్ అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. తద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు వీలుంటుందని ఇరుదేశాల ప్రతినిధులు ఆకాంక్షించారు. 

భారత్ తరఫున కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సెనెగల్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి ఐసాటా తాల్ సాల్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఆఫ్రికా ఖండంలో ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా సెనెగల్ సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు. కరోనా నేపథ్యంలోనూ భారత్-సెనెగల్ దేశాల మధ్య వాణిజ్యం 37శాతం పెరిగి 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదవడం అభినందనీయమన్నారు. వ్యవసాయం, ఆయిల్ అండ్ గ్యాస్, వైద్యం, రైల్వేలు, గనులు, రక్షణ, హరిత శక్తి తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు. 

సెనెగల్ నుంచి భారతదేశానికి పెద్దమొత్తంలో ఫాస్పేట్లు, ఎరువుల సంబంధిత ముడిపదార్థాలు ఎగుమతి అవుతుండటాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ కంపెనీలు గనుల తవ్వకాలు తదితర రంగాల్లో తమ నైపుణ్యతతో కూడిన సేవలను సెనెగల్ లో అందించేందుకు అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయ సౌరకూటమిలో సెనెగల్ సభ్యత్వం అభినందనీయమన్న ఆయన, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ విషయంలోనూ ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు వీలుందన్నారు. డకార్ లో అప్ గ్రెడేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (సీఈడీటీ) రెండో దశ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రకటించారు. 2002లో డకార్ లో మొదటి విడత సీఈడీటీ ప్రారంభించినప్పటినుంచీ ప్రతి ఏటా వెయ్యిమంది ఆఫ్రికన్ యువతకు (ఇందులో ఎక్కువ మంది సెనెగల్ నుంచే) ఈ కేంద్రం ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
సుష్మాస్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్, సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్యలో 2021లో జరిగిన ఒప్పందం ద్వారా ప్రతి ఏటా 15 మంది సెనెగల్ దౌత్యవేత్తలకు శిక్షణ ప్రారంభిఝచనున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. 

ఈ చర్చల సందర్భంగా.. మాదక ద్రవ్యాల అక్రమరవాణా కేసులో సెనెగల్ అధికారులకు పట్టుబడి ఇక్కడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు భారతీయులను వదిలిపెట్టాలని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ కేసును వేగవంతంగా విచారించి ఆ నలుగురు భారతీయులను వదిలిపెట్టాలని కోరారు. ఈ నలుగురి కోసం వారి కుటుంబసభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని మానవతాదృక్పథంతో ఆలోచించాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వం విషయంలో సెనెగల్ ఇచ్చిన మద్దతుకు ఉపరాష్ట్రపతి ధన్యవాదములు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక పోరు, అలీనోద్యమం, సౌరకూటమి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో ఇరుదేశాలు కలిసిపనిచేద్దామని ఆయన అన్నారు.

ఈ చర్చల్లో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ,విసయ్ పాల్ సింగ్ తోమర్,పి.రవీంద్రనాథ్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com