టిటిడి:రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సామూహిక వివాహాలు..

- June 03, 2022 , by Maagulf
టిటిడి:రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సామూహిక వివాహాలు..

తిరుమల: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించే వారని గుర్తు చేశారు. ఆయన మరణం తరువాత కార్యక్రమం నిలిపివేశారనీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో ఈ కార్యక్రమం పునఃప్రారంభించాలని తమ పాలకమండలి నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి వివరించారు.

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని చైర్మన్ తెలిపారు.

అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com