'మేజర్' మూవీ రివ్యూ

- June 03, 2022 , by Maagulf
\'మేజర్\' మూవీ రివ్యూ

తారాగణం: అడవి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల తదితరులు

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
విడుదల తేదీ: 03.06.2022

‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న హీరో అడవి శేష్. ఆర్ధిక రాజధాని ముంబైలో  జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే పలు చోట్ల ‘మేజర్’ ప్రివ్యూలు ప్రదర్శించారు. కానీ, ఎక్కడా కథ లీక్ అవ్వకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కథ, ఆడియన్స్‌ని ఎంత మేర ఆకట్టుకుందో చూడాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

సందీప్ ఉన్నికృష్ణన్ (అడవి శేష్) ఓ మధ్యతరగతి యువకుడు. తండ్రి అతన్ని డాక్టర్ చేయాలనుకుంటాడు. తల్లి ఇంజనీర్‌గా చూడాలనుకుంటుంది. కానీ, సందీప్ మాత్రం చిన్నతనం నుంచీ నేవీ ఆఫీసర్‌ అవ్వాలన్న కోరికతోనే ఎదుగుతాడు. ఓ సారి నేవీ ఎగ్జామ్స్‌కి అటెండ్ అవుతాడు. ఎగ్జామ్ పాసవుతాడు. కానీ, ఇంటర్వ్యూలో ఫెయిలవుతాడు. అదే సమయంలో ఈషా (సయీ మంజ్రేకర్)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. నేవీ ఆఫీసర్ అవ్వాలన్న కోరికతోనే కష్టపడి ఎన్‌ఎస్‌జీ కమెండో ఛీప్‌గా ఎదుగుతాడు.

ఈ లోపు ఇంట్లోని ఓ చిన్న సమస్య కారణంగా లీవ్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ముంబై మీదుగా బెంగుళూర్ వెళ్లాలన్నది సందీప్ ప్లాన్. అయితే, అనుకోకుండానే ముంబైలో ఉగ్రదాడి మొదలవుతుంది. ఎన్‌ఎస్‌జీ కమెండోగా అప్పుడు సందీప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు.? తాజ్ హోటల్‌లో దాగిన ఉగ్ర మూకల్ని మట్టుబెట్టడంలో సందీప్ వీరోచిత పోరాటం ఎలా సాగింది.? అసలు తన ఇంట్లోని సమస్య ఏంటీ.? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే:

మేజర్ పాత్రకు తగ్గట్టుగా మేకోవర్‌తో బాగా ఆకట్టుకున్నాడు అడవి శేష్. ఎమోషనల్ సీన్లలో నటుడిగా ఇంతకు ముందు కన్నా బాగా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది అడవి శేష్‌లో. సీనియర్ నటీ నటులు ప్రకాష్ రాజ్, రేవతి తమ అనుభవాన్ని రంగరించారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ ట్రెడిషనల్ పాత్రలో కనిపించి మెప్పించింది. శోభితా ధూళిపాళ్ల పాత్రకు పెద్దగా స్కోపు లేదు. కానీ, తన పాత్ర పరిధి మేర బాగానే న్యాయం చేసింది. మిగిలిన పాత్ర ధారులు ఓకే అనిపించారు.

సాంకేతికంగా:

లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘మేజర్’. ఉగ్రవాదులకీ, ఎన్‌ఎస్‌జీ కమాండోలకీ మధ్య జరిగే యుద్ధ వాతావరణాన్ని ఎమోషనల్ కనెక్టింగ్‌తో బాగా చిత్రీకరించారు. ఈ వార్ సీన్ అంతా చిత్రీకరించడానికి వేసిన హోటల్ సెట్ ఆకట్టుకుంటుంది. ఆ వార్ ఎట్మాస్పియర్‌లోకి ప్రేక్షకున్ని తీసుకెళ్లిపోతుంది. సినిమాటో గ్రఫీ బావుంది. అబ్బూరి రవి రాసిన మాటలు ఎమోషనల్‌గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. దేశం కోసం ఓ సైనికుడు ప్రాణ త్యాగం చేస్తుంటే, తన కుటుంబం పడే తపన, తాపత్రయం సెకండాఫ్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు ప్రతీ ఒక్క భారతీయుడు ఫిదా అవ్వాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ డైలాగ్స్
అడవి శేష్ పర్‌ఫామెన్స్

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ స్లో నెరేషన్

విశ్లేషణ:

కథలోకి ప్రేక్షకున్ని తీసుకెళ్లడానికి డైరెక్టర్ చాలా సమయం తీసుకున్నాడనిపిస్తుంది. ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల రూపంలో తెరకెక్కాయి. అయితే, ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా మాత్రమే తెరకెక్కిన సినిమా కావడంతో, కమాండోగా ముందు ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని తెలియచేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శశికిరణ్. ఆయన బాల్యం, తల్లితండ్రులు, ప్రేమ, ఆర్మీలో జాయిన్ అవ్వడం.. తదితర విషయాల్ని చెప్పే క్రమంలోనే అడుగడుగునా దేశభక్తిని తట్టి లేపే ఎమోషనల్ సాహసం చేశాడు డైరెక్టర్ ‘మేజర్’ సినిమాతో. అయితే, ఈ ప్రయత్నమే కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఓహో.! ముంబై ఉగ్రదాడిలో హోరా హోరీ పోరాటం ఇలా జరిగిందా.? అని ప్రేక్షకుడు ఉత్సుకతతో చూస్తుంటాడు.

చివరిగా:  మేజర్.. దేశభక్తి నరనరాల్లో నిండిపోయిన వారికి మాత్రమే ఈ అమరవీరుడి కథ నచ్చుతుందని చెప్పొచ్చేమో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com