'విక్రమ్' మూవీ రివ్యూ

- June 03, 2022 , by Maagulf
\'విక్రమ్\' మూవీ రివ్యూ

తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ పాజిల్, సూర్య (గెస్ట్ రోల్), అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్, శివానీ నారాయణన్ తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
కథ, కథనం, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
విడుదల తేదీ: 03.06.2022

విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి సినిమా వస్తుందంటే అంతటా ఆసక్తి నెలకొనడం సహజమే. ఏదో మ్యాజిక్ వుంటుంది ఆయన సినిమాలో. హిట్టు, ఫెయిల్యూర్‌తో సంబంధం లేదు ఆయన సినిమాలకు. అయితే, చాలా కాలంగా ఆయన నుంచి సినిమా రాలేదు. దాంతో తాజాగా ‘విక్రమ్’ సినిమాపై కమల్ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజైంది. 67 ఏళ్ల వయసులోనూ కమల్ యాక్షన్ సీన్స్ ఓ ఎత్తైతే, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి వెర్సటైల్ నటుల పర్ఫామెన్స్ ఈ సినిమాకి మరో హైలైట్. అలాగే మరో స్టార్ హీరో సూర్య గెస్ట్ అప్పియరెన్స్ ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. ట్రైలర్‌తోనే భారీగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా కథ, కమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథ:

‘విక్రమ్’ ఫుల్ ఆఫ్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా రూపొందిందన్న సంగతి తెలిసిందే. అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్ హాసన్) ఓ ‘రా’ ఏజెంట్. నగరంలో మాస్క్ మేన్ పేరుతో అనేక కిడ్నాపులు జరుగుతుంటాయ్. అదే సమయంలో మరో పోలీస్ ఆఫీసర్ అమర్ (ఫహాద్ ఫాజిల్), ఆ మాస్క్ మేన్‌ని పట్టుకోవడానికి గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సంతానం (విజయ్ సేతుపతి) అను గ్యాంగ్ ‌స్టర్ గురించి తెలుసుకుంటాడు. నగరంలో జరిగే కిడ్నాపులకీ, ఈ గ్యాంగ్‌స్టర్‌కీ ఏదో సంబంధం వుందని అమర్ తెలుసుకుంటాడు. మరోవైపు సీక్రెట్ మిషన్ ద్వారా రా ఏజెంటుగా విక్రమ్‌కీ ఈ విషయం తెలుస్తుంది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు కలిసి మాస్క్ మేన్ ఆచూకి ఎలా కనిపెట్టారు.? అసలింతకీ మాస్క్ మేన్ ఎవరు.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే:

ముందే చెప్పుకున్నాం కదా.. ఇదో పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అందరూ టాలెంటెడ్ యాక్టర్సే. బలమైన పాత్రలు, ముందుగా కమల్ హాసన్ 67 ఏళ్ల వయసులో ఆయన చేసిన యాక్షన్ ఫీట్లు వావ్ అనిపిస్తాయ్. అంత ఆషా మాషీ కావవి. విజయ్ సేతుపతి గురించి, ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి కూడా అందరికీ తెలిసిందే. మరోసారి ఆయన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో. ఫహాద్ ఫాజిల్ మలయాళ నటుడే అయినా ఆయన నట విశ్వరూపం గురించి కూడా పలు సినిమాల్లో చూసేశాం. ఇంకోసారి ఆయన తన కళ్లతోనే వేల రకాల హావభావాలు పలికించి సినిమాకి హైలైట్‌గా నిలిచాడు. హీరోయిన్ శివానికి పెద్దగా స్కోప్ లేదు. మిగిలిన తారాగణం అంతా తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతికంగా:

దర్శకుడు కనగరాజ్ టేకింగ్ గురించి ప్రత్యేకంగానే మాట్లాడుకోవాలి. డైరెక్టర్‌గా మరో మెట్టు పైకెక్కాడు ఈ సినిమాతో ఆయన. డార్క్ థీమ్ స్టోరీస్‌ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ‘విక్రమ్’ సినిమా ద్వారా ప్రేక్షకున్ని తన ప్రపంచంలోకి లాక్కెళ్లి కూర్చోబెడతాడు. అందుకే ఆయన సినిమాలకు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయిపోతారు. తను రాసుకున్న పవర్ ఫుల్ సన్నివేశాలకు తగ్గట్లుగా టాలెంటెడ్ నటీనటులు దొరకడంతో ‘విక్రమ్’ కథ మరింత బలంగా మారింది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌తో సినిమాటోగ్రఫీ వుంది. దాంతో యాక్షన్ ఎపిసోడ్స్‌లో విజువల్ మ్యాజిక్ జరిగింది. కథా, కథనానికి తగ్గట్లుగా అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలం చేకూర్చింది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్:
కథ, స్ర్కీన్ ప్లే
నటీనటులు పర్ఫామెన్స్
బ్యాక్ ‌గ్రౌండ్ మ్యూజిక్
రిచ్ సినిమాటోగ్రఫీ
క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్:
కాస్త స్లోగా సాగిన సెకండాఫ్

విశ్లేషణ:

ఓవరాల్‌గా ‘విక్రమ్’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది. కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అనేలా వుంది ఆయన నటన ఈ సినిమాలో. రెండు వేరియేషన్స్ వున్న పాత్రల్లో కమల్ అదరగొట్టేశారు. సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెరిగేలా ఇంటర్వెల్ కట్ చేశారు.అయితే, సెకండాఫ్‌లో కమల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త స్లోగా అనిపించింది.మళ్లీ క్లైమాక్స్‌లో స్క్రీన్ ప్లే పరుగులు పెట్టింది.దాంతో సినిమా చూస్తున్నంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు.

చివరిగా: ‘విక్రమ్’ ఓ మంచి విజువల్ యాక్షన్ మూవీ.

గల్ఫ్ లో ఈ సినిమాని Golden Cinema LLC విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com