ప్రవాస భారతీయుల విజయమే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల గౌరవాన్ని పెంచింది: ఉపరాష్ట్రపతి

- June 07, 2022 , by Maagulf
ప్రవాస భారతీయుల విజయమే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల గౌరవాన్ని పెంచింది: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 9 రోజులపాటు సాగిన మూడుదేశాల పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుని మగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. గబాన్, సెనెగల్ పర్యటన అనంతరం ఖతార్ పర్యటన చివరి రోజు ఖతార్ లోని భారతసంతతి ప్రజలు, అక్కడి మన వ్యాపారవేత్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖతార్ దేశాభివృద్ధిలో భారత సంతతి ప్రజల కృషిని ఆయన అభినందించారు. ఖతార్ దేశాధినేతతోపాటు ఇతర అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలోనూ భారత సంతతి ప్రజలు తమ దేశాభిృద్ధిలో భాగస్వాములయిన విషయాన్ని తనతో పంచుకున్నారని..  తోటి భారతీయుడిగా ఈ విషయం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఖతార్ లోని 7.8 లక్షల బలమైన భారతీయ సమాజం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు.

‘మీ బలమే భారతదేశానికి బలం. భారతదేశం శక్తే మీ శక్తి’ అన్న ఉపరాష్ట్రపతి, వందేభారత్ మిషన్, ఆపరేషన్ గంగ, ఆపరేషన్ దేవి శక్తి వంటివి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత చర్యలని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతి ప్రజలు సాధిస్తున్న విజయాలే, భారతదేశం పట్ల గౌరవభావలను పెంపొందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ శక్తి సామర్థ్యాలను విదేశాల్లో విజయాలు నమోదు చేయడంతోపాటు భారత యువతలోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడా వినియోగించాలని ఆయన సూచించారు.

ఇరుదేశాల మధ్య గతేడాది కరోనా నేపథ్యంలోనూ 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగడం శుభపరిణామమని, ఖతార్ లో సంపూర్ణంగా భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలు 50కి పైగా మౌలికవసతుల, ఐటీ కంపెనీలుండటం అభినందనీయమన్నారు. దీంతోపాటుగా 15వేలకు పైగా కంపెనీలు ఇరుదేశాల వ్యక్తులు నడిపిస్తుండటం భారత్-ఖతార్ మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధానికి సంకేతమన్నారు.

వచ్చే ఏడాది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇరుదేశాలు సమగ్రమైన ఎనర్జీ భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు, రక్షణ, భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాయి. దీంతోపాటుగా ఖతార్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ చైర్ ఏర్పాటుచేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించడం క్రీడలు, సాంస్కృతిక ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో భారతదేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరోనా నిర్వహణలో, భారతీయులతోపాటు ప్రపంచానికి టీకాలు అందజేయడంలో, పేదలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో దేశ సుస్థిర, సమగ్రాభివృద్ధి తదితర అంశాల్లో భారతప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయన్నారు. ప్రజాకేంద్రిత పథకాల కారణంగా పథకాల పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా అమలవుతోందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారతదేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయుడికీ కుల, మత, ప్రాంత, వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానమైన హక్కులున్నాయన్నారు. విదేశాల్లో ఉంటున్న భారత సంతతి ప్రజలు కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. దీంతోపాటుగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విస్తృతం చేయాలని, మాతృభాషలో మాట్లాడాలని ఆయన సూచించారు.

శాంతి నెలకొన్నప్పుడే పురోగతి సాధ్యం అవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతి దేశం హింసను అణిచివేస్తూనే ఇతర దేశాలపట్ల పరస్పర గౌరవంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

ఈ మూడుదేశాల పర్యటనలో ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఎంపీలు సుశీల్ మోదీ,విజయ్ పాల్ సింగ్ తోమర్,పి. రవీంద్రనాథ్ తోపాటు ఉపరాష్ట్రపతి కార్యాలయ ఉన్నతాధికారులు, విదేశాంగశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com