అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

- June 21, 2022 , by Maagulf
అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: యోగ ప్రాచీనమైన శాస్త్రం మాత్రమే గాక, సార్వజనీనమైనదని, భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. యోగను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ప్రయోజనాలు పొందాలని సూచించిన ఆయన, జీవితంలో వివిధ శారీరక, మానసిక సమస్యల పరిష్కారానికి యోగ ఎలా ఉపయోగపడుతుందన్న ఆంశం మీద పరిశోధనలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
 
మానవత్వం కోసం యోగ అనే ఈ ఏడాది ఇతివృత్తం గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, మనసు, శరీరం, ప్రకృతి మధ్య ఐక్యత సాధించడంలో యోగ ప్రయోజనకారిగా ఉంటుందని, అదే సమయంలో యోగ ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ సమాజంలో ఇతరులకు చేతనైనంత సహాయాన్ని, సహకారాన్ని అందించాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత, సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ, యోగ ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
 
భారతీయ సనాతన ధర్మంలోని పలు అంశాల నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, దేశాభివృద్ధి కోసం ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ‘యోగ కర్మసు కౌశలం’ అన్న భగవద్గీత సూక్తిని ఉదహరించిన ఆయన, అనారోగ్యం లేని శరీరం, తికమకలు లేని మనసు, సందేహాలు లేని బుద్ధి ఈ మూడింటిని సాధించ గలిగిన నాడే జీవనం చక్కని మార్గంలో ముందుకు సాగుతుందని తెలిపారు. యోగ అభ్యాసం శారీరక మానసిక ఆరోగ్యాన్నే గాక, వృత్తులలో కావలసిన నైపుణ్యాన్ని అందిస్తుందన్న ఉపరాష్ట్రపతి, పవృత్తితో సంబంధం లేకుండా యోగ మార్గాన్ని అనుసరించే వారు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
 
యోగ శాస్త్రాన్ని ప్రొత్సహించడంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాట మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి, ప్రకృతి పట్ల ప్రేమ, సకల జీవరాశుల పట్ల దయ, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక భారతీయ సంస్కృతిగా యోగను అభివర్ణించారు. మన పూర్వీకులు అందించిన ఈ బహుమతి మనందరికీ గర్వకారణమని, యోగను విశ్వవ్యాపితం చేయాలని సూచించారు. 
 
యోగకు వయసు, కులం, మతం, ప్రాతీయ బేధాలు లేవన్న ఉపరాష్ట్రపతి ఇది సార్వజనీనమైనదని, అన్ని కాలాలకు వర్తిస్తుందని నొక్కి చెప్పారు. యోగను చేయడం, ప్రచారం కల్పించడం గర్వకారణంగా భావించాలని సూచించారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి,ప్రముఖ నటుడు అడివిశేష్, ప్రముఖ క్రీడాకారిణి కుమారి పి.వి.సింధు,  సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com